‘ఆ మూడు మాత్రలతో కరోనా కట్టడి..ప్రయోగాత్మకంగా రుజువు’

20 Nov, 2021 07:46 IST|Sakshi

సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : కరోనాను తరిమేసేందుకు ఆస్ప్రిన్, మిథైల్‌ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్‌లు చాలని కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు యనమదల మురళీకృష్ణ తెలిపారు. ప్రయోగాత్మకంగా ఈ విషయం రుజువైందంటూ శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 60 మంది కోవిడ్‌ బాధితులకు వారం పాటు ఆస్ప్రిన్‌ 150 ఎం.జీ. రోజుకొకటి, మిథైల్‌ప్రెడ్నిసోలాన్‌ 10 ఎం.జీ. ఉదయం, రాత్రి, అలాగే అజిత్రోమైసిన్‌ 250 ఎంజీ ఉదయం, రాత్రి ఇచ్చి వైద్యం అందిస్తే.. 59 మంది కేవలం వారంలో పూర్తిగా కోలుకున్నట్టు తెలిపారు.

వారి సాచ్యురేషన్‌ స్థాయి 93 శాతం పైనే కొనసాగిందని పేర్కొన్నారు. తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న పారాసిట్మాల్, ఐవిర్‌మెక్ట్ర్‌న్, హైడ్రాక్సీక్లోరోక్వినోన్, డాక్సీసైక్లిన్‌ తీసుకున్న 60 మందిలో 8 మంది ఆరోగ్యం దిగజారి ఆస్పత్రి పాలైనట్టు వెల్లడించారు. తాను ప్రతిపాదించిన మూడు మాత్రలతో కోలుకున్న వారిలో నిస్సత్తువ నామమాత్రానికే పరిమితం కాగా, తొలి నుంచి ప్రతిపాదనలో ఉన్న మందులు వాడిన వారిలో దీర్ఘకాలిన నిస్సత్తువ, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నట్టు తెలిపారు.

తన పరిశోధనల సారాంశాన్ని అధ్యయన పత్రాల రూపంలో ఈ నెల 17, 18 తేదీల్లో అమెరికాలో జరిగిన  ‘గ్లోబల్‌ సమ్మిట్‌ ఆన్‌ డిసీజెస్‌’లో సమర్పించినట్లు డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. తన అధ్యయనాన్ని కోయలిస్‌ గ్రూప్‌ స్కోపస్‌ ఇండెక్స్‌ అనే ప్రామాణిక పరిశోధనల డేటా బేస్‌లో ప్రచురిస్తారని మురళీకృష్ణ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు