ప్రాణం ఖరీదు రూ.2 లక్షలు!

15 Aug, 2020 05:54 IST|Sakshi
మృతి చెందిన అనూష (ఫైల్‌) ,అనూష జన్మనిచ్చిన ఆడబిడ్డ

క్రాంతి ఆస్పత్రిలో బాలింత మృతి వివాదాస్పదం 

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆందోళన 

డబ్బులిచ్చి చేతులు దులుపుకున్న ఆస్పత్రి యాజమాన్యం? 

అనంతపురం హాస్పిటల్‌: నగరంలోని క్రాంతి ఆస్పత్రిలో శుక్రవారం ఓ బాలింత మృతి వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. చివరికి ఆస్పత్రి యాజమాన్యం మృతురాలి కుటుంబీకులకు రూ.2 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నట్లు తెలిసింది.

వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలం అలంకరాయునిపేటకు చెందిన శివశేషారెడ్డి, అనూష దంపతులు. అనూష గర్భందాల్చినప్పటి నుంచి నగరంలోని క్రాంతి ఆస్పత్రిలోనే చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13న పురిటినొప్పులు రావడంతో క్రాంతి ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు 12 గంటలకు అనూష ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో అనూషకు రక్తస్రావం మొదలైంది. రక్తస్రావం ఆగకపోవడంతో వైద్యులు గర్భసంచి తొలగించాలని మూడు బాటిళ్ల బీ పాజిటివ్‌ రక్తం కావాలని చెప్పారు. దీంతో భర్త శివశేషారెడ్డి, తదితరులు రక్తం సిద్ధం చేశారు. రక్తస్రావం ఆగకపోవడంతో వైద్యులు ప్రాణం కాపాడలేమని చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో అనూష (20) మృతి చెందింది.  

కుటుంబ సభ్యుల ఆందోళన 
వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందంటూ భర్త శివశేషారెడ్డి వారి కుటుంబ సభ్యులు క్రాంతి ఆస్పత్రి నిర్వాహకుడు మురళీని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. త్రీటౌన్‌ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకున్నారు. 

బాధిత కుటుంబంతో సెటిల్‌మెంట్‌
బాలింత అనూష మృతికి నైతిక బాధ్యత వహిస్తూ క్రాంతి ఆస్పత్రి యాజమాన్యం రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. డబ్బులు మళ్లీ ఇస్తామని చెప్పడంతో మృతుల కుటుంబాలు ఒప్పుకోలేదని తెలిసింది. చివరికి ప్రస్తుతం చెక్‌ తీసుకెళ్లాలని, శనివారం రూ.2 లక్షలు క్యాష్‌ తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. 

పత్తాలేని ఆరోగ్యశాఖ 
ప్రభుత్వం మాతా, శిశు మరణాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటుంటే ఆరోగ్యశాఖ మాత్రం ఓ బాలింత మృతి జరిగినా అటువైపు తొంగిచూడలేదు. ఒక్క అధికారి కూడా క్రాంతి ఆస్పత్రిలో జరిగిన ఘటనపై స్పందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

కార్డియాక్‌ వల్లనే... 
బాలింత అనూషకు కార్డియాక్‌ అరెస్టు కావడం వల్లనే మృతి చెందిందని, తమ వైద్యుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదని క్రాంతి ఆస్పత్రి నిర్వాహకుడు మురళీ తెలిపారు. 

మరిన్ని వార్తలు