ప్రతి చోటా అవమానాలే.. ఫోటోలు, వీడియో తీసుకురా అంటున్నారు..

14 Oct, 2021 08:32 IST|Sakshi
కన్నీటి పర్యంతరమవుతున్న భార్గవీలత  

ప్రత్తిపాడులో మూడు నెలల గర్భవతి కన్నీటి వేదన  

పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు 

అవమానించేలా మాట్లాడారంటూ ఆత్మహత్యాయత్నం

సాక్షి, ప్రత్తిపాడు: ‘నా భర్త  నన్ను వదిలేసి కనిపించకుండా పోయాడు.. న్యాయం కోసం మూడు వారాలుగా పోలీస్‌ స్టేషను చుట్టూ తిరుగుతున్నా.. నన్ను చూసి హేళనగా మాట్లాడుతున్నారే గానీ న్యాయం చెయ్యడం లేదు.. అదేమంటే నీ భర్తను నువ్వే వెతుక్కో.. ఎక్కడున్నాడో తెలిస్తే మాకు చెప్పు.. మేమొచ్చి తీసుకొస్తామంటున్నా’రంటూ వివాహిత తీవ్ర ఆవేదన చెందిన ఘటన ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. ప్రత్తిపాడుకు చెందిన భార్గవీలత ఇదే గ్రామానికి చెందిన డి. బాజిబాబు ప్రేమించుకున్నారు.

పలు వివాదాల అనంతరం లాక్‌డౌన్‌ సమయంలో స్థానిక పరమేశ్వరస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. తరువాత కొద్దిరోజులకే భర్త మొఖం చాటేయడంతో భార్గవీలత భర్త ఇంటి ముంగిట బైటాయించి పోరాటం చేసింది. దీంతో పంచాయతీ స్టేషనుకు చేరడం, ఇరువర్గాలతో పోలీసులు మాట్లాడి భార్యభర్తలిద్దరికీ సర్దిచెప్పి కాపురానికి పంపారు. అయితే, తాజాగా మరోసారి వివాదం తెరమీదకొచ్చింది. గత నెల 22న భర్త ఇంటి నుంచి వెళ్లి పోవడంతో భార్గవి ప్రత్తిపాడు పోలీసుల్ని ఆశ్రయించింది. 23న పోలీసులు వెతికి భర్తను అప్పగించారు. రెండు రోజులు సవ్యంగా ఉన్న భర్త 26న మరలా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి స్టేషను చుట్టూ నిత్యం తిరుగుతోంది.

బుధవారం రాత్రి స్టేషనుకు వెళ్లిన భార్గవికి పోలీసులు ‘నీ భర్తను నువ్వే వెతికి ఎక్కడున్నాడో ఫోటోలు, వీడియో తీసుకుని రా.. అప్పుడు మేమొస్తామని చెబుతూ చులకనగా మాట్లాడా’రని భార్గవి ఆరోపిస్తుంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించేందుకు తలుపులు వేసుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు పగలగొట్టి భార్గవిని బయటకు తీసుకువచ్చారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ భర్త కోసం ఎక్కడికి వెళ్లినా వెళ్లిన ప్రతి చోటా తనకు అవమానాలే ఎదురవుతున్నాయని, ప్రస్తుతం తాను మూడవ నెల గర్భవతిని అని వాపోయింది.  

చదవండి: (స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి.. పట్టాలపై శవమై తేలిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌)

అయితే, ఈ విషయమై ఎస్‌ఐ విజయ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా మొదట మిస్సింగ్‌ కంప్లెయింట్‌ ఇవ్వగానే వెతికి పట్టుకొచ్చి భర్తను అప్పగించామని, మరలా వెళ్లాడని చెప్పడంతో పలు ప్రాంతాల్లో వెతికామని చెప్పారు. అయినప్పటికీ, అతను కనిపించలేదని చెప్పారు. ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తానని చెప్పామని, దానికి ఆమె అంగీకరించడం లేదని ఎస్‌ఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు