ఏప్రిల్‌ 16 నుంచి ఏపీలో అకాల వర్షాలు

12 Apr, 2021 03:42 IST|Sakshi

నైరుతి రాకకు సంకేతాలు!

సాక్షి, విశాఖపట్నం: వాతావరణం క్రమంగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా నడి వేసవిలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. ఎండలు పెరిగి అకాల వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇవన్నీ.. నైరుతి రుతుపవనాల రాకకు ముందస్తు సంకేతాలని భావిస్తున్నారు. మధ్య బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు రాష్ట్రంపై విస్తరిస్తున్నాయి.

ఈ తేమ గాలులు క్రమంగా దిగువకు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 16 నుంచి రాయలసీమలోని కర్నూలులో వర్షాలు ప్రారంభమై క్రమంగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తాయని, అదేవిధంగా.. కోస్తాంధ్రలోనూ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.

ఈ నెల 22 వరకు వర్షాలు పడే సూచనలున్నాయని, దీని వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంపై తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కురుపాంలో 3.1 సెం.మీ., గుమ్మలక్ష్మీపురంలో 2.7, చింటూరులో 2.1, రుద్రవరం, బుట్టాయగూడెంలలో 1.7, పెదకూరపాడులో 1.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు