ఎయిడ్స్‌ నియంత్రణకు ప్రెప్‌ అస్త్రం 

11 Jul, 2022 04:04 IST|Sakshi

హైరిస్క్‌ వర్గాల వారికి ప్రెప్‌ మాత్రల పంపిణీ 

బహిరంగ మార్కెట్‌లో 30 మాత్రల ధర రూ.2 వేలు 

సబ్సిడీపై రూ.450కే పంపిణీ చేస్తున్న ఏపీ శాక్స్‌ 

విజయవాడ, వైజాగ్‌లలో గత నెల నుంచి పంపిణీ 

త్వరలో కాకినాడ, కర్నూలు, తిరుపతిల్లో కూడా.. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎయిడ్స్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హైరిస్క్‌ వర్గాల వారికి  ప్రీ–ఎక్స్‌పోజర్‌ ప్రొఫైలాక్సిస్‌ (ప్రెప్‌) ఔషధాలు అందజేస్తోంది. చెన్నైకి చెందిన వలంటరీ హెల్త్‌ సొసైటీ (వీహెచ్‌ఎస్‌) ద్వారా ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (ఏపీ శాక్స్‌) వీటిని పంపిణీ చేస్తోంది. కండోమ్‌ వినియోగంలో పొరపాట్లు, ఇతర సురక్షితం కాని శృంగారం వల్ల కలిగే ఎయిడ్స్‌ వ్యాప్తిని ఈ మాత్రలు నిరోధిస్తాయి. బహిరంగ మార్కెట్‌లో 30 మాత్రల ధర రూ.2 వేలు ఉంది. వీటిని సబ్సిడీపై వైద్యశాఖ రూ.450కే పంపిణీ చేస్తోంది. విజయవాడ, వైజాగ్‌లలో ఇప్పటికే పంపిణీ ప్రారంభించారు.

హైరిస్క్‌ వర్గాలుగా పరిగణించే ఫీమేల్‌ సెక్స్‌ వర్కర్లు, స్వలింగ సంపర్కులు (మేల్‌ హోమో సెక్సువల్స్‌), ట్రాన్స్‌జెండర్లు, ఇంజెక్షన్ల ద్వారా మత్తు పదార్థాలు తీసుకునేవారికి సబ్సిడీపై ఈ మాత్రలు అందిస్తున్నారు. ఎయిడ్స్‌ హైరిస్క్‌ వర్గాల్లో ట్రాన్స్‌జెండర్లు ఒకరు. సమాజంలో వివక్షకు లోనయ్యే వీరికి వైద్యంతో పాటు సామాజిక తోడ్పాటు అందించడానికి విజయవాడ, వైజాగ్‌లలో ట్రాన్స్‌జెండర్స్‌ వన్‌స్టాప్‌లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో వైద్యుడు, ఏఎన్‌ఎం, సిబ్బంది ఉంటారు.

ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌లకు ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అవగాహన కల్పించి వైద్య సహాయం అందిస్తున్నారు. విజయవాడ జీజీహెచ్, విశాఖ కేజీహెచ్‌లలో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు సైతం ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధి, న్యాయపరమైన సహకారం అందిస్తున్నారు. హైరిస్క్‌ గ్రూపుల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా ఇక్కడ సహాయం లభిస్తోంది. ఇక్కడే ప్రెప్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. త్వరలో తిరుపతి, కర్నూలు, కాకినాడల్లో కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రెప్‌ మాత్రలు పంపిణీ చేయనున్నారు.  

పంపిణీ ఇలా 
వన్‌స్టాప్‌ సెంటర్లకు వచ్చిన హైరిస్క్‌ వర్గాల్లోని హెచ్‌ఐవీ నెగెటివ్‌ వ్యక్తులకు ప్రెప్‌ మాత్రల వినియోగం వల్ల ప్రయోజనాలను వివరిస్తారు. అనంతరం హెచ్‌ఐవీ నిర్ధారణ, కిడ్నీ, లివర్‌ పనితీరు సహా పలు రకాల వైద్యపరీక్షలు చేస్తారు. పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రెప్‌ మాత్రల వినియోగానికి అర్హులో కాదో వైద్యులు నిర్ధారిస్తారు. వైద్యుల సూచన మేరకు మాత్రలు అందిస్తారు. అనంతరం వన్‌స్టాప్‌ సెంటర్‌లోని వైద్యుడు ఆ వ్యక్తిని రోజూ ఫోన్‌ ద్వారా సంప్రదించి మాత్రలు వినియోగిస్తున్నారో లేదో ఫాలోఅప్‌ చేస్తారు. 

ముందు, తర్వాత 21 రోజుల చొప్పున వాడాలి 
ప్రెప్‌ మాత్రల వినియోగం వల్ల ఎయిడ్స్‌ వ్యాధి సోకదు. శృంగారంలో పాల్గొనడానికి 21 రోజుల ముందు నుంచి, చివరిసారిగా శృంగారంలో పాల్గొన్న తరువాత 21వ రోజు వరకు రోజుకు ఒక మాత్ర వాడాలి. అప్పుడే ప్రభావవంతంగా పనిచేస్తుంది. వైద్యులను సంప్రదించకుండా వాడకూడదు. ఎస్టీడీతో పాటు ఇతర జబ్బులు సోకకుండా ఉండాలంటే అపరిచితులతో శృంగారంలో కండోమ్‌ తప్పనిసరిగా ఉపయోగించాలి.  
– డాక్టర్‌ ప్రత్యూష, టీజీ వన్‌స్టాప్‌ సెంటర్‌ వైద్యురాలు, విజయవాడ 

ప్రజల్లో చైతన్యం ఇంకా పెరగాలి 
ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రజల్లో ఇంకా చైతన్యం పెరగాలి. వ్యాధి వ్యాప్తి తగ్గిందిలే అని నిర్లక్ష్యం వహించకూడదు. వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసి రాబోయే తరాలకు సురక్షిత ఆరోగ్యం ప్రసాదించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. విజయవాడ, వైజాగ్‌లలో ప్రెప్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నాం. త్వరలో తిరుపతి, కాకినాడ, కర్నూలుల్లో కూడా ప్రారంభిస్తాం. 
– నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శాక్స్‌ పీడీ 

మరిన్ని వార్తలు