ప్రతి స్వీట్‌కు ఓ తేదీ! 

20 Oct, 2020 10:12 IST|Sakshi

స్వీట్స్‌పై తయారీ, ఎక్స్‌పైరీ తేదీలు తప్పనిసరి 

వ్యాపారులకు ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆదేశం 

నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా 

సాక్షి, గుంటూరు‌: స్వీట్స్‌ ఇష్టపడని వారెవరుంటారు. కలాకండ్, గులాబ్‌ జామూన్, లడ్డూ, జిలేబి ఇలా ఎన్నో రకాల స్వీట్లు చూడగానే నోరూరకమానదు. కానీ, మనం కొనే స్వీట్స్‌ ప్రతిసారి బాగుంటాయని చెప్పలేం. ఎందుకంటే వాటిపై ఎక్స్‌పైరీ తేదీ ఉండదు. ఈ క్రమంలోనే ప్రజలు ఒక్కో సారి కాలపరిమితి దాటిన స్వీట్లను కొనుగోలు చేసి రోగాల బారిన పడుతున్నారు. అందుకనే ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా ప్రతి స్వీట్‌పై తయారీ, ఎక్స్‌పైరీ తేదీ ముద్రించాలని నిబంధన విధించింది.  

►జిల్లాలో 400 మంది ఫుడ్‌సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని స్వీట్స్‌ విక్రయాలు సాగిస్తుండగా మరో 1200 మంది వరకు తోపుడు బండ్లపై అనధికారికంగా అమ్మకాలు చేస్తున్నారు. 
►అయితే కొత్త నిబంధనల ప్రకారం స్వీట్లు విక్రయించే ప్రతి ఒక్కరూ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది.  
ఏఏ స్వీట్లు.. ఎన్ని రోజుల్లో తినాలి  
►కలాకండ్, బట్టర్‌ స్కాచ్, చాక్లెట్‌ కలాకండ్‌ తదితర స్వీట్లు తయారు చేసిన రోజునే తినేయాలి.   
►పాల పదార్థాలు, బెంగాలీ స్వీట్స్‌ , బాదం మిల్క్, రసగుల్ల, రసమలై వంటి స్వీట్లను రెండు రోజుల్లో వినియోగించాలి.  
►లడ్డు, కోవాస్వీట్స్, మిల్క్‌ కేక్, బూందీలడ్డు, కోకోనట్‌ బర్ఫీ, కోవా బాదం వంటివి తయారు చేసిన నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటాయి. 
►నేతితో చేసిన స్వీట్స్, డ్రై ఫ్రూట్స్‌ హాల్వా, డ్రైఫ్రూట్‌ లడ్డు, అంజీర కేక్, కాజు లడ్డూ వంటి వాటిని వారంలో తినాలి.  
►బసెస్‌ లడ్డూ, అటా లడ్డూ, చనా లడ్డూ, చనా బర్ఫీ, చిక్కీలు తయారు చేసిన 30 రోజుల వరకు నిల్వ ఉంటాయి.   

రూ.రెండు లక్షల వరకు జరిమానా  
స్వీట్లు విక్రయించే వ్యాపారులు కచ్చితంగా వాటిపై తయారీ, గడువు తేదీలను ముద్రించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తాం. నాణ్యత లేకుండా, తేదీలు ముద్రించకుండా స్వీట్లు విక్రయిస్తున్న వారి సమాచారాన్ని 98484 70969 నంబర్‌కు తెలియజేయాలి. 
– షేక్‌ గౌస్‌ మొహిద్దీన్, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్, గుంటూరు    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు