పదో తరగతి విద్యార్థుల డేటా తయారీ పదిలం 

17 Jan, 2023 17:28 IST|Sakshi

తప్పులు, దోషాలు లేకుండా నామినల్‌ రోల్స్‌

ఎన్‌ఆర్‌లలో సవరణకు ప్రభుత్వం చర్యలు

ఈ నెల 20వ తేదీ వరకు దోషాలు, తప్పుల సవరణకు అవకాశం

శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి విద్యార్థుల డేటా తయారీని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపుల పర్వం దాదాపుగా పూర్తయ్యింది. జిల్లాలో 589 ఉన్నత పాఠశాలల్లో 30214 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఇందు లో ప్రభుత్వ బడుల నుంచి 22979 మంది, ప్రైవేటు స్కూల్స్‌ నుంచి 7,235 మంది విద్యార్థులు ఉన్నారు.  

పక్కాగా, పారదర్శకంగా ఉండేందుకు.. 
ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి మొదలుకానున్న టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల డేటాతోపాటు వారి వ్యక్తిగత సమాచారం పక్కగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే భవిష్యత్‌లో విద్యార్థుల మార్క్స్‌ మెమోలో తలెత్తే తప్పులకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులే బాధ్యులని అధికారులు పేర్కొంటున్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాఠశాల విద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.  

నామినల్స్‌ సవరణకు అవకాశం 
పదో తరగతి విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ సవరణకు ప్రభ్వుతం సన్నద్ధమైంది. దీంతో విద్యార్థుల వ్యక్తిగత సమాచారం ముఖ్యంగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, జన్మదినం, మీడియం, వారి ఫొటో, సంతకం, ఆధార్‌ కార్డు నంబర్, పుట్టుమచ్చలు, మొ దటి, ద్వితీయ భాష, తదితర సమాచారం పక్కాగా ఉండేలా చూడాలని పాఠశాల విద్య కమిషనర్‌ ఆదేశించారు. దీంతో ఒకవేళ పొరపాటున కంప్యూటర్‌లో డేటానమోదు సమయంలో తలెత్తిన దోషాలు, తప్పుల సవరణకు ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 

ఇందుకు పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ‘ఎడిట్‌’ ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే పీహెచ్‌సీ విద్యార్థుల సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేసిన కాపీని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంబంధిత సెక్షన్‌లో ఒరిజినల్, జిరాక్స్‌ కాపీలను ఈ నెల 25వ తేదీలోగా తీసుకువచ్చి ధ్రువీకరించుకుని వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.   

ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి 
జిల్లాలోని పదో తరగతి విద్యార్థుల నామినల్‌ రోల్స్‌లో తప్పులు, దోషాలు ఉంటే వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ఎడిట్‌ ఆప్షన్‌ను ఇచ్చింది. ఈనెల 20వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. హెచ్‌ఎంల లాగిన్‌లో ఎడిట్‌ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో విద్యార్థుల డేటాలో ఉండే తప్పులకు హెచ్‌ఎంలే బాధ్యులవుతారు. ఒకటికి రెండు సార్లు విద్యార్థుల డేటాను సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 
– గార పగడాలమ్మ, డీఈఓ శ్రీకాకుళం

మరిన్ని వార్తలు