సాగర గర్భంలో పర్యాటకం

31 Jul, 2022 09:58 IST|Sakshi

స్కూబా డైవింగ్‌పై యువత ఆసక్తి

విశాఖ కేంద్రంగా అకాడమీ ఏర్పాటుకు సన్నాహాలు

విశాఖ తీరం పర్యాటకులకు వినూత్న అనుభూతులను అందిస్తోంది. సాగరగర్భంలోని అనంత సంపద అందాల మధ్య ఈత కొట్టిస్తోంది. సాహసాలు చేసే యువతకు స్కూబా డైవింగ్‌ (సముద్ర లోతుల్లో ఈత)లో దేశంలోనే అగ్రశ్రేణి ప్రాంతంగా నిలుస్తోంది. ఇప్పటికే రుషికొండ బీచ్‌ బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌తో అంతర్జాతీయ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం విశాఖ కేంద్రంగానే స్కూబా డైవింగ్‌ అకాడమీ ఏర్పాటుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.     
– సాక్షి, అమరావతి

ఎన్నెన్నో డైవింగ్‌ స్పాట్లు 
విశాఖ సముద్ర జలాల లోతుల్లో ఈదుతూ స్పష్టంగా చూడగలిగే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇవే పర్యాటకులను స్కూబా డైవింగ్‌ వైపు ఆకర్షిస్తున్నాయి. పూడిమడక బీచ్‌లో 3 స్పాట్స్, రుషికొండలో 2, మంగమారిపేటలో 3, భీమిలిలో సైతం సాగర అడుగు భాగంలోని అరుదైన మత్స్య, వృక్ష, జంతు సంపదతో డైవింగ్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతాలను స్థానిక స్కూబా డైవర్లే కనుగొనడం విశేషం. 

అరుదైన చింతపల్లి..
ప్రభుత్వం విజయనగరం జిల్లా తీర ప్రాంత గ్రామమైన చింతపల్లిలో స్కూబా డైవింగ్‌ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇక్కడి సముద్ర జలాలు మాల్‌దీవులు, అండమాన్‌ పరిస్థితులను పోలి ఉండటంతో పాటు అడుగున ఓడ శిథిలాలు, చిన్నచిన్న పర్వతాలు, జంతుజాలం ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒడ్డు నుంచి 10 కిలో మీటర్ల లోపలికి వెళ్లితే 5 స్పాట్‌ల్లో సముద్రగర్భ అందాలను చూడవచ్చు. 

ప్రపంచంలో ఎక్కడైనా.. 
పర్యాటకులతో సరదాగా స్కూబా డైవింగ్‌ చేయించడంతో పాటు అకాడమీ ద్వారా సర్టిఫికేషన్‌ కోర్సులు అందించనున్నారు. తద్వారా ప్రపంచ సముద్ర జలాల్లో స్కూబా డైవింగ్‌ చేసేందుకు అర్హత లభిస్తుంది. ఇందులో ఓపెన్‌ వాటర్, అడ్వాన్స్‌ ఓపెన్‌ వాటర్‌ విభాగాల్లో డైÐŒ లు చేయాల్సి ఉంటుంది. వీరికి శిక్షణలో భాగంగా తొలుత స్విమ్మింగ్‌ పూల్‌ (నిశ్చల జలాల్లో) మెలకువలు నేర్పిస్తారు. సముద్రం అడుగు భాగంలోని వాతావరణ పరిస్థితులను బోధిస్తారు. రెండు రోజుల నుంచి వారం పాటు సాగే ఈ కోర్సుల్లో చేరేవారికి కచ్చితంగా ఈత వచ్చి ఉండాలి. ఒక్కో కోర్సుకు సుమారు  రూ. 25 వేల వరకు ఫీజు ఉంటుంది. దేశంలో గోవా, నేత్రాని ద్వీపం (గోవా సమీపంలోని కర్ణాటక తీరంలో), పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్‌ దీవుల్లో మాత్రమే డైవింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్కూబా డైవింగ్‌ను సాహస క్రీడగా పేర్కొంటూ అందులో విశేష ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం టెన్జింగ్‌ నార్గే అవార్డును సైతం అందిస్తోంది. దీనిని అర్జున అవార్డుతో సమానంగా గుర్తిస్తారు. 

రెండు విధాలుగా.. 
విశాఖలో పర్యాటకులకు రెండు రకాల స్కూబా డైవింగ్‌ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి డైవింగ్‌ మాస్టర్‌ ప్రత్యేక సూచనలిస్తూ ఒడ్డు నుంచి ఈదుకుంటూ 500 మీటర్ల వరకు సముద్ర జలాల్లోకి తీసుకెళ్తారు. మరో విధానంలో బోటుపై 1.5కిలో మీటర్ల సముద్రం లోనికి తీసుకెళ్లి డైవింగ్‌ చేయిస్తారు. రెండింటిలోనూ 8–11 మీటర్ల లోతు వరకే పర్యాటకులను అనుమతిస్తారు. ఇందు కోసం రూ.2,500 నుంచి రూ.4వేలకు పైగా ఫీజు వసూలు చేస్తారు. పర్యాటకులు సాహసం చేసే సమయంలో వీడియోను చిత్రీకరించి అందిస్తారు.  

ప్రశాంత జలాల్లోనే.. 
ఉదయం పూట సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అలల ఉధృతి తక్కువగా ఉండటంతో పాటు సాగర గర్భంలో పరిస్థితులు నెమ్మదిగా ఉంటాయి. అందుకే ఉదయం పూటనే స్కూబా డైవింగ్‌ను చేయిస్తున్నాం. సాయంత్రం అయితే సముద్రం పోటు ఎక్కువగా ఉండి.. డైవర్లకు విజిబులిటీ తక్కువ అవుతుంది. గతంతో పోలిస్తే పర్యాటకులు సంఖ్య పెరుగుతోంది. స్కూబా డైవింగ్‌కు వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉంటే ఎవరైనా చేయవచ్చు. మనకు చింతపల్లి అంతర్జాతీయ స్థాయి స్కూబా డైవింగ్‌ కేంద్రంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వంతో కలిసి అక్కడ అక్టోబర్‌ నుంచి అకాడమీ సేవలను ప్రారంభించనున్నాం. 
– బలరామ్‌నాయుడు, లైవ్‌ ఇన్‌ అడ్వెంచర్స్, విశాఖపట్నం  

మరిన్ని వార్తలు