మహిళా ఖైదీలకు క్షమాభిక్ష 

7 Nov, 2020 08:09 IST|Sakshi
రాజమహేంద్రవరంలోని మహిళా సెంట్రల్‌ జైలు (ఫైల్‌)   

మహిళా ఖైదీలు విడుదలకు జాబితా సిద్ధం

జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి 

21 మంది విడుదలయ్యే అవకాశం

జాబితా తయారు చేస్తున్న అధికారులు

రాజమహేంద్రవరం క్రైం: రాష్ట్రంలోని మహిళా జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 131 నంబర్‌ జీఓ విడుదల చేసింది. మహిళా జీవిత ఖైదీలకు ప్రత్యేకంగా క్షమాభిక్ష జీఓ విడుదల చేయడం ఇదే మొట్ట మొదటిసారి. ఇప్పటి వరకూ పురుషులతో కలిపి ఇస్తూ వచ్చేవారు. మహిళా ఖైదీల కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక జీఓ విడుదల చేయించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళా ఖైదీలు విడుదల కావాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో ఆలస్యమైంది. ఆ జీఓ ప్రకారం.. 2020 ఆగస్టు 15వ తేదీ నాటికి రిమాండ్, రెమిషన్‌ కలిపి ఐదేళ్లు పూర్తిచేసుకున్న వారు క్షమాభిక్షకు అర్హులు. రాజమహేంద్రవరం మహిళా సెంట్రల్‌ జైల్‌ నుంచి సుమారు 21 మంది మహిళా ఖైదీలు విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. కడప జైలు నుంచి 29 మంది, విశాఖపట్నం జైలు నుంచి ఇద్దరిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు.  ఎంతమంది ఖైదీలు క్షమాభిక్షకు అర్హులో జైలు అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. దానిని రాష్ట్ర ప్రభుత్వ జైళ్ల శాఖకు పంపిస్తారు. అక్కడ పరిశీలన చేసిన అనంతరం మహిళా జీవిత ఖైదీలను విడుదల చేస్తారు. (చదవండి: దేశ చరిత్రలోనే గొప్ప నిర్ణయం..)

వీరు అనర్హులు.. 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొందరు మహిళా ఖైదీలు క్షమాభిక్షకు అనర్హులు. కిడ్నాప్‌ కేసులలో శిక్ష పడిన వారు, రేప్‌ కేసులో శిక్ష పడిన మహిళలు, మరణ శిక్ష పడిన ఖైదీలు, మూడేళ్లలో జైలు నుంచి పరారైన జీవిత ఖైదీలు, పెరోల్, పర్లోపై వెళ్లి ఆలస్యంగా జైలుకు వచ్చిన వారు అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముద్దాయిలు, ముఠా తగాదాలలో శిక్ష పడిన వారు, నార్కో అనాలసిస్‌ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారు, దేశ ద్రోహం కేసులు ఎదుర్కొంటున్న వారు, కిరాయి హంతకులు కూడా అనర్హులే. 

>
మరిన్ని వార్తలు