విద్యుత్‌ కొనుగోలు లెక్కలు సిద్ధం

31 Dec, 2021 04:28 IST|Sakshi

2017 నుంచి 2020 వరకు కొనుగోలు ఖర్చులు చెబుతామన్న డిస్కంలు

యూనిట్‌కు రూ.3.68 నుంచి, రూ.4.63 వరకు ధర

ఫిబ్రవరి 2న వర్చువల్‌గా ఏపీఈఆర్‌సీ విచారణ 

సాక్షి, అమరావతి: విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2017 నుంచి 2020 వరకు విద్యుత్‌ కొనుగోలుకు చేసిన ఖర్చుల లెక్కలను సమర్పించేందుకు అనుమతి ఇ వ్వాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) కోరాయి. 2017–18 సంవత్సరంలో చేసిన ఖర్చును 2018–19 సంవత్సరానికి, 2018–19లో చేసిన ఖర్చును 2019–20కి అన్వయించమని విజ్ఞప్తి చేశాయి.

యూనిట్‌కు రూ.3.68 నుంచి రూ.4.62 వరకు వెచ్చించినట్లు ఈపీడీసీఎల్, రూ.3.68 నుంచి రూ.4.63 వెచ్చించినట్లు ఎస్పీడీసీఎల్‌ వెల్లడించాయి. వీటి ఆధారంగా పూర్తిస్థాయిలో ‘పూల్డ్‌ కాస్ట్‌ ఆఫ్‌ పవర్‌ పర్చేజ్‌’ గణాంకాలను సమర్పిస్తామని తెలిపాయి. డిస్కంలు చెప్పిన ధరలపై అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని ఏపీఈఆర్‌సీ వివిధ వర్గాల విద్యుత్‌ వినియోగదారులను కోరింది. డిస్కంల ప్రతిపాదనలపై ఫిబ్రవరి 2వ తేదీన వర్చువల్‌గా విచారించనున్నట్లు తెలిపింది.

బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలుకు డిస్కంలకు అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఏపీఎస్‌ ఎల్‌డీసీ) ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌  రెగ్యులేషన్‌–2006కి సంబంధించి కొన్ని మార్పులను ప్రతిపాదించింది. విద్యుత్‌ పంపిణీ సంస్థల ద్వారా బహిరంగ మార్కెట్‌లో చౌక విద్యుత్‌ కొనుగోలుకు అవకాశం కల్పించేలా వీటిని రూపొందించారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిబంధనలతోనే ఏపీఈఆర్‌సీ నడుస్తోంది. నియామకాలు, కార్యకలాపాలకు సంబంధించి రాష్ట్రానికి ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేయాల్సి ఉంది. కేంద్ర విద్యుత్‌ చట్టం–2003 ప్రకారం నిబంధనలు తయారు చేస్తున్నట్లు ఏపీఈఆర్‌సీ గతంలోనే తెలిపింది.

తాజాగా డిస్కంలకు సంబంధించి రెగ్యులేషన్స్‌లోని 7వ నిబంధనను సవరించాలని ఏపీఎస్‌ఎల్‌డీసీ కోరింది. దీనివల్ల డిస్కంలు పరస్పరం తమ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు విద్యుత్‌ కొనుగోలులో జరిగే ఆలస్యాన్ని అరికట్టవచ్చు. దీనికి సంబంధించిన ప్రతిదీ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌కు తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సవరణపై జనవరి 12వ తేదీలోగా ప్రజలు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలపాలని ఏపీఈఆర్‌సీ కోరింది. అనంతరం కొత్త రెగ్యులేషన్స్‌ను ప్రకటించనుంది. 

మరిన్ని వార్తలు