ఎయిర్‌ ఇండియా వన్‌లో రాష్ట్రపతి తొలి ప్రయాణం

25 Nov, 2020 04:25 IST|Sakshi
ఎయిరిండియా వన్‌బీ777 విమానానికి పూజలు నిర్వహిస్తున్న రాష్ట్రపతి దంపతులు

పలు ప్రత్యేకతలతో రూపొందిన బీ777

ఢిల్లీ విమానాశ్రయంలో పూజలు నిర్వహించిన కోవింద్‌ దంపతులు

చెన్నైకి బీ777లో రాక అక్కడి నుంచి రేణిగుంటకు వన్‌బీ77లో చేరిక

సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిరిండియా వన్‌–బీ777 తన గగన విహారాన్ని మంగళవారం ప్రారంభించింది. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, భారత ప్రథమ మహిళ సవితా కోవింద్‌ అందులో తొలి ప్రయాణం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వారు ఎయిరిండియా వన్‌–బీ777 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లో న్యూఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వన్‌బీ77 విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. ఎయిరిండియా వన్‌లో తమ తొలి ప్రయాణాన్ని ఆరంభించడానికి ముందు రాష్ట్రపతి దంపతులు న్యూఢిల్లీ పాలం విమానాశ్రయంలో పూజలు నిర్వహించారు.

అమెరికా ప్రెసిడెంట్‌ ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’ తరహాలోనే..
అమెరికా అధ్యక్షుడు వినియోగించే ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’ తరహాలోనే ఎయిరిండియా వన్‌ను రూపొందించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు వీవీఐపీల కోసం వాడుతున్న బీ747–400 స్థానంలో ఈ కొత్త బీ777ను తీసుకువచ్చారు. పాత విమానంతో పోలిస్తే ఈ విమాన ఇంధన సామర్థ్యం, రేంజ్‌ అధికం. రెండు బీ777 విమానాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది. ఒక్కో విమానాన్ని రూ.703.83 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తొలి ప్రయాణం సందర్భంగా రాష్ట్రపతి.. పైలట్లను, క్రూ మెంబర్లను, ఎయిర్‌ ఇండియా బృందాన్ని, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ను అభినందించారు.  
ఎయిరిండియా వన్‌ పైలెట్లు, సిబ్బందితో రాష్ట్రపతి దంపతులు 

ఎయిరిండియా వన్‌బీ777 ప్రత్యేకతలివే..
► అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యంత ఆధునిక సౌకర్యాలను కలిగిన ఎయిరిండియా వన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఏకధాటిగా 17 గంటల పాటు ప్రయాణించగలదు. 
► ఎలాంటి వాతావరణ విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. 
► క్షిపణి దాడుల నుంచి తనను తాను రక్షించుకునే స్వీయ రక్షణ వ్యవస్థను దీనికి అమర్చారు. 
► లార్జ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కౌంటర్‌ మెజర్స్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. 
► కాగా, ఈ విమానం అమెరికాలో సిద్ధమై అక్టోబర్‌ 1న భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు