క్యాన్సర్‌పై యుద్ధం..మాస్‌ స్క్రీనింగ్‌ దిశగా అడుగులు

29 Mar, 2022 08:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో ముఖ్యమైన అంశంపై దృష్టిపెట్టింది. దేశంలో గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలు సంభవిస్తున్న క్యాన్సర్‌ మహమ్మారిపై యుద్ధానికి సన్నద్ధమైంది. క్యాన్సర్‌ వైద్యం, నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్‌ కేర్‌)గా నియమించింది.

ఆయన ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంవల్ల నివారణకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా.. ప్రాణాపాయంతో పాటు, వైద్యానికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో మాస్‌ స్క్రీనింగ్‌కు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిద్వారా నోటి (ఓరల్‌) క్యాన్సర్‌తో పాటు మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌), రొమ్ము (బ్రెస్ట్‌) క్యాన్సర్‌లను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందించాలనేది సర్కారు లక్ష్యం.

గుంటూరు జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ పైలట్‌ ప్రాజెక్టు చేపట్టింది. గ్రామంలో సచివాలయం యూనిట్‌గా మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ) సాయంతో ముగ్గురు గైనకాలజీ, ముగ్గురు అంకాలజీ వైద్యులు గత శనివారం స్క్రీనింగ్‌ నిర్వహించారు. గ్రామంలో 2,400 మంది జనాభా ఉండగా వీరిలో 30 నుంచి 60 ఏళ్లు పైబడిన మహిళలు 640 మందికి ఉన్నారు. వీరందరికీ స్క్రీనింగ్‌ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని గ్రామ వలంటీర్, ఆశా వర్కర్, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంలు ఇళ్లకు వెళ్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

240 మంది మహిళలు స్క్రీనింగ్‌కు ముందుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం రొమ్ము క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలున్న 70 మందికి వైద్యులు ఎంఎంయూలోనే మామోగ్రామ్‌ పరీక్ష చేశారు. అదేవిధంగా 117 మందికి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ నిర్ధారణకు సంబంధించిన పాప్‌స్మియర్‌ పరీక్ష నిర్వహించారు. రిపోర్ట్‌లన్నింటీని గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్‌ కేర్‌ విభాగానికి తరలించారు.

ఇక్కడి నిపుణుల పరిశీలన అనంతరం బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారించనున్నారు. అదే విధంగా స్వచ్ఛందంగా వచ్చిన 27 మంది పురుషులకు నోటి క్యాన్సర్‌ పరీక్షలు చేయగా ఇద్దరికి అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించారు. ఈ పైలట్‌ ప్రాజెక్టులో గుర్తించిన అంశాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా మాస్‌ స్క్రీనింగ్‌ నిర్వహణకు వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్‌ నేతృత్వంలోని కోర్‌ కమిటీ ప్రణాళిక సిద్ధంచేసింది. మాస్‌ స్క్రీనింగ్‌ నిర్వహణకు మూడు విధానాలను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. 

సచివాలయం యూనిట్‌గా స్క్రీనింగ్‌ నిర్వహణ
సచివాలయం యూనిట్‌గా మాస్‌ స్క్రీనింగ్‌ నిర్వహణ చేపట్టబోతున్నాం. అనంతరం గుర్తించిన క్యాన్సర్‌ రోగులను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ ద్వారా దగ్గరలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రికి తరలిస్తాం. ఆసుపత్రిలో వీరికి ప్రభుత్వమే ఉచితంగా క్యాన్సర్‌ చికిత్స అందిస్తుంది. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎంలు వాకబు చేస్తారు. 
– నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి 

మరిన్ని వార్తలు