ఆలయ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట

20 Jun, 2022 07:33 IST|Sakshi

ఆక్రమణదారుల చెరలో 1.05 లక్షల ఎకరాల దేవుడి భూములు..  

నోటీసిచ్చిన వారంలో స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణ

దాదాపు 18 వేల ఎకరాలను తక్షణమే విడిపించే అవకాశం..

దేవుడి మాన్యాలను పరిరక్షించే దిశగా ప్రభుత్వం చర్యలు..  

కేబినెట్‌ భేటీలో సవరణ ప్రతిపాదనలపై చర్చించే చాన్స్‌

దేవుడి భూమిని లీజుకు తీసుకున్న కౌలుదారుడు గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకుంటే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అధికారులు ముందుగా ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేయాలి. అక్కడి నుంచి అనుమతి పొందాకే చర్యలు చేపట్టాలి. ఈలోపు ఆక్రమణదారులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటే ఇక అది అంతులేని కథే! రూ.వందల కోట్ల విలువ చేసే ఆలయాల స్థలాలతో పాటు అనుబంధంగా ఉండే షాపుల లీజు వ్యవహారం కూడా ఇంతే. రాష్ట్రవ్యాప్తంగా 1,05,364 ఎకరాలు ఆక్రమణదారుల చెరలో చిక్కుకున్నట్లు అంచనా. ఇకపై ఇలాంటి వ్యవహారాలకు తెరదించేలా దేవదాయ శాఖ చట్ట సవరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సాక్షి, అమరావతి: దేవుడి భూముల అక్రమణలకు శాశ్వతంగా తెరదించేలా దేవదాయ శాఖ చట్టంలో పలు సవరణలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. లీజు గడువు ముగిసిన తర్వాత కూడా దేవుడి భూములను ఖాళీ చేయకుండా అక్రమంగా కొనసాగుతున్న వారికి ఒకే ఒక్క నోటీసు ఇచ్చి వారం రోజుల్లోగా తిరిగి స్వాధీనం చేసుకునేలా దేవదాయ శాఖ చట్టం నిబంధనలు సవరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్డినెన్స్‌ లేదా అసెంబ్లీలో చట్ట సవరణ ప్రక్రియ పూర్తయితే కేవలం నోటీసుల జారీ ద్వారానే 17,839 ఎకరాల దేవుడి భూములను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.  

రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణదారుల చెరలో దాదాపు 1.05 లక్షల ఎకరాల దేవుడి భూములు  ఉండగా 17,839 ఎకరాలకు సంబంధించి నాలుగైదు ఏళ్ల క్రితమే గడువు ముగిసినా ఖాళీ చేయకుండా పాత లీజుదారులే కొనసాగుతున్నట్లు దేవదాయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. కోర్టు స్టే లాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఆక్రమణదారుల చెరలో ఉన్న ఇలాంటి భూములను కొత్త సవరణ చట్టం ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే వీలుంటుందని అధికారులు వివరించారు.  

ఆర్టీసీ, రైల్వే లీజుల్లో ఇప్పటికే..  
లీజు గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకుండా కొనసాగుతుంటే కేవలం అధికారుల స్థాయిలోనే నోటీసులిచ్చి స్వాధీనం చేసుకునే విధానం రైల్వే, ఆర్టీసీలో ఇప్పటికే అమలులో ఉంది. దేవదాయ శాఖ భూములు, స్థలాలు, షాపుల విషయంలో  ట్రిబ్యునల్‌ను కూడా సంప్రదించాలన్న నిబంధన కారణంగా అక్రమ అనుభవదారుల సంఖ్య పెరిగినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీసీ, రైల్వే తరహాలో నిబంధనలు తేవడం ద్వారా దీన్ని అరికట్టవచ్చని తెలిపాయి.  

సీజీఎఫ్‌ నిధులకు ఆదాయ పరిమితి పెంపు! 
శిధిలావస్థకు చేరుకున్న పురాతన, పాత ఆలయాల పునఃనిర్మాణానికి కామన్‌ గుడ్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ప్రస్తుతం ఉన్న ఆలయాల గరిష్ట ఆదాయ పరిమితిని పెంచుతూ చట్ట సవరణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు