గత సర్కారు పాపం.. డిస్కమ్‌లకు శాపం

9 Jun, 2021 03:26 IST|Sakshi

2014–19 మధ్య పీపీఏలన్నీ దారుణం.. 2014 తర్వాత సౌర, పవన శక్తుల ఇష్టారాజ్యం

ఇతర రాష్ట్రాలకన్నా ఇక్కడే ఎక్కువ ధర.. ఏయేటికాయేడు ధర పెంచేలా ఒప్పందాలు

సోలార్‌కు గరిష్టంగా రూ.6.49

పవన విద్యుత్‌లోనూ ప్రైవేటు దోపిడీ

పీపీఏలపై నిజాలు వెల్లడించిన నిపుణుల కమిటీ

సాక్షి, అమరావతి: ప్రైవేటు పవన, సౌరవిద్యుత్‌ కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు విద్యుత్‌ సంస్థలకు శాపంగా మారింది. అవసరం లేకున్నా విద్యుత్‌ తీసుకోవడం ఒకటైతే, ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ చెల్లిస్తూ ఒప్పందాలు చేసుకోవడం మరో కోణం. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ల–పీపీఏల) విషయంలో ఇదే తేల్చి చెప్పింది. 2014–19 మధ్య జరిగిన ఒప్పందాలన్నీ డిస్కమ్‌లను నిలువునా అప్పులపాలు చేసే విధంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజాధనాన్ని కొంతమందికి కట్టబెట్టే ఈ విధానంపై పునఃసమీక్ష అవసరమని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తొలిరోజుల్లోనే భావించింది.

రాష్ట్రంలో 2015 వరకు 91 పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలున్నాయి. వాటి సామర్థ్యం కేవలం 691.55 మెగావాట్లు. కానీ ఆ తర్వాత 2019 వరకు ఏకంగా 3,494 మెగావాట్ల సామర్థ్యంగల 133 ఒప్పందాలు జరిగాయి. అంతకుముందు గరిష్టంగా యూనిట్‌కు రూ.3.74 చెల్లిస్తే.. 2015 నుంచి యూనిట్‌కు రూ.4.84 చొప్పున చెల్లించారు. 25 ఏళ్లపాటు అమల్లో ఉండేలా జరిగిన ఈ పీపీఏల వల్ల డిస్కమ్‌లు ప్రైవేటు సంస్థలకు రూ.39,280 కోట్లు చెల్లించాలి. సోలార్‌ విద్యుత్‌ విషయంలోనూ ఇదేవిధంగా కొనసాగింది. 2014 వరకు రూ.384 కోట్ల విలువ చేసే 92 మెగావాట్ల మేరకు 11 పీపీఏలు ఉండేవి. 2015–19 మధ్య 2,308 మెగావాట్ల మేర 36 పీపీఏలు జరిగాయి. వీటివిలువ రూ.22,868 కోట్లు. ఫలితంగా ఇప్పటికీ  పవన, సౌరవిద్యుత్‌ ఉత్పత్తిదారులకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.

ఎక్కడా లేని ధర
2015–19 మధ్య ప్రైవేటు పవన, సౌరవిద్యుత్‌ ఉత్పత్తిదారులకు అప్పటి ప్రభుత్వం ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడలేదు. వాళ్లనుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చినా లెక్కజేయలేదు. 2014లో సోలార్‌ విద్యుత్‌ను యూనిట్‌ రూ.6.99 ధరతో పీపీఏ చేసుకుంది. ఇదే సమయంలో పంజాబ్‌ యూనిట్‌ రూ.6.88 ధరకి పీపీఏ చేసుకుంది. 2016లో సోలార్‌ పీపీఏలు దాదాపు 1,500 మెగావాట్ల మేర జరిగాయి. అప్పుడు కూడా గరిష్టంగా యూనిట్‌ ధర రూ.6.80. అదే సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం యూనిట్‌ రూ.4.66 ధరతో నెడ్‌క్యాప్, జెన్‌కో, ఎన్టీపీసీ, సెకీతో ఒప్పందాలు చేసుకుంది.

ఆ తర్వాత కాలంలోఅన్ని రాష్ట్రాల్లో యూనిట్‌ ధర రూ.2కు పడిపోయినా మన రాష్ట్రంలో మాత్రం రూ.4.50కే పీపీఏలు చేసుకోవడాన్నిబట్టి వీటివెనుక రాజకీయ కారణాలున్నాయనే విమర్శలొచ్చాయి. పవన విద్యుత్‌ పీపీఏల విషయానికొస్తే 2014లో అన్ని రాష్ట్రాల్లో యూనిట్‌ రూ.3.50 ఉంటే.. మన రాష్ట్రంలో రూ.4.83 చొప్పున జరిగాయి. తమిళనాడు, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాల్లో యూనిట్‌ రూ.3.46 కొనసాగినా.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కు రూ.4.84తోనే ఒప్పందాలు చేసుకుంది. ఈ విధంగా ప్రైవేటు పట్ల అపరిమిత ప్రేమ చూపించడం వల్ల.. ఇప్పుడు డిస్కమ్‌లు ఆర్థికభారంతో కుంగిపోయే పరిస్థితి ఏర్పడింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు