మిర్చి ‘ధర’హాసం

8 Sep, 2020 07:21 IST|Sakshi

క్వింటాకు సరాసరి రూ.2,000 పెరిగిన ధర

సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌ దేశాలకు ఎగుమతి ఆర్డర్లు

కోల్డ్‌ స్టోరేజీల్లో 40 లక్షల టిక్కీలకు పైగా నిల్వలు  

సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా కష్టకాలంలోనూ మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి వచ్చే సమయానికి కరోనా వైరస్‌ వ్యాప్తితో గుంటూరు మార్కెట్‌ యార్డు మూతపడి లావాలాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రైతులు తాము పండించిన మిర్చిని కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని 118 కోల్డ్‌ స్టోరేజీల్లో దాదాపు కోటి టిక్కీలకు పైగా సరుకు నిల్వ చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అమ్మకాలు మొదలైన 60 లక్షల టిక్కీలను విక్రయించగలిగారు. ప్రస్తుతం కోల్డ్‌ స్టోరేజీల్లో దాదాపు 40 లక్షలకు పైగా మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నాయి. (చదవండి: మిరపకాయలతో గుండెపోటుకు చెక్‌!)

కలిసొచ్చిన ఎగుమతులు
గత నెలతో పోలిస్తే ఈ నెలలో మిర్చి ధరలు క్వింటాకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో మిర్చి పంట ఆలస్యం కావడంతో మన రాష్ట్రంలోని మిర్చికి డిమాండ్‌ పెరిగింది.
దీనికి తోడు సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి ఆర్డర్లు రావడం మిర్చి రైతులకు కలిసొచ్చింది. 
గుంటూరు జిల్లాలో దాదాపు 1.95 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 
దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, ధరలు సైతం బాగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఊపందుకున్న విక్రయాలు
కరోనా నేపథ్యంలో మార్కెట్‌ యార్డులో మిర్చి క్రయ, విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. అనంతరం క్రయవిక్రయాలు మొదలైనా రోజుకు కేవలం 10 వేల టిక్కీల లోపు మాత్రమే అమ్ముడయ్యేవి.
సొంత గ్రామాలకు వెళ్లిన కూలీలు తిరిగి రావడం, ధరలు సైతం పెరగడంతో మిర్చి క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి.
గుంటూరు మార్కెట్‌ యార్డులో ప్రస్తుతం రోజుకు సగటున 20 వేల టిక్కీల వరకు మిర్చి లావాదేవీలు జరుగుతున్నాయి. 
బయట కోల్డ్‌ స్టోరేజీల్లో సైతం రోజుకు 30 వేల టిక్కీల వ్యాపారం సాగుతోంది. 

రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
గుంటూరు మార్కెట్‌ యార్డులో మిర్చి క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. రైతులు పంటను విక్రయించుకోవడానికి వీలుగా అన్ని వసతుల్ని మార్కెట్‌ యార్డులో కల్పిస్తున్నాం. ధరలు సైతం స్థిరంగా ఉండి కొంత పెరగడంతో రైతులు సరుకును అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
– వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి, గుంటూరు 
(చదవండి: ఇదీ పౌష్టికాహార మెనూ..

మరిన్ని వార్తలు