‘పైసా’చికం

30 Jul, 2020 07:38 IST|Sakshi

అమ్మో... అంబులెన్స్‌ 

రోగిని ఆస్పత్రికి తరలించాలంటే రూ.వేలు

మృతదేహమైతే రూ.లక్ష డిమాండ్‌

అడిగినంత ఇవ్వకపోతే ససేమిరా

అల్లాడిపోతున్న సామాన్యులు 

నల్లచెరువు మండలం కమ్మవారిపల్లికి చెందిన ఓ చేనేత కార్మికుడు పదేళ్లుగా ధర్మవరంలో ఉంటూ మగ్గం నేసేవాడు. ఇటీవల కరోనా సోకగా, అనంతపురం పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల కిందట మరణించాడు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్‌ నిర్వాహకుడు రూ.70 వేలు డిమాండ్‌ చేశాడు. తాము అంత ఇవ్వలేమని బతిమలాడినా వినలేదు. చివరకు గ్రామస్తులు కలుగజేసుకొని అప్పటికప్పుడు వడ్డీకి రూ.50 వేలు తెచ్చి డ్రైవర్‌కు చెల్లించుకున్నారు. 

పామిడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఈ నెల 27న అనంతపురం సంగమేశ్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్య పరిస్థితి విషమించగా వైద్యులు బెంగళూరులోని ఓ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. దీంతో కుటుంబీకులు ఓ అంబులెన్స్‌ నిర్వాహకుడిని సంప్రదిస్తే అతను రూ.70 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో తమ వద్ద అంతమొత్తం లేదని కాళ్లావేళ్లాపడినా వినలేదు. చివరకు ఆస్పత్రి యాజమాని కల్పించుకుని రూ.15 వేలు ఇస్తారని చెప్పినా...అంబులెన్స్‌ నిర్వాహకుడు తన గిట్టదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. (అల్లా దయవల్లే.. ఇప్పటికైతే అంతా సేప్‌!)

అనంతపురం సిటీ:  ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్న వాడు.. ’ అని ఓ సినీ కవి రాసిన పాట ఇప్పటి పరిస్థితికి అతికినట్లు సరిపోతుంది. కరోనా విజృంభణతో ప్రపంచమంతా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోంది. జిల్లాలోనూ కేసులు ఎక్కువ కావడంతో జనం అల్లాడిపోతున్నారు. వైద్య సేవల కోసం ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. సాటి మనిషికి సాయమందించాల్సిన ఈ సమయంలోనూ కొందరు ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు మానవత్వాన్ని మరచిపోయారు. ఆస్పత్రిలోని రోగిని బెంగళూరు వంటి నగరాలకు తరలించాలన్నా, ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను స్వగ్రామాలకు తరలించాలన్నా రూ.లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితి జిల్లా అంతటా నెలకొనడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. 

గుంటనక్కల్లా కేటుగాళ్లు 
కరోనా దెబ్బకు మనిషిని మనిషి ముట్టుకోవడమే గగనమైపోయింది. దీన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకున్న కొందరు.. ఆస్పత్రి మొదలు శ్మశాన వాటిక వరకు గుంటనక్కల్లా కాసుక్కూర్చుని ఉంటున్నారు. ఆస్పత్రిలో ఎవరైనా చనిపోతే రాబందుల్లా వాలిపోయి బాధిత కుటుంబం నుంచి భారీగా వసూలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు కొన్ని ఆస్పత్రుల యజమానులతో కుమ్మక్కు కాగా, ప్రభుత్వాస్పత్రుల్లో కొందరు సెక్యూరిటీ, మరికొందరు ఆస్పత్రిలో పని చేసే కింది స్థాయి సిబ్బందితో చేతులు కలుపుతున్నారు. ఎవరినైనా వైద్యులు ఇతర ప్రాంతాలకు రెఫర్‌ చేసినా...లేదా ఏ రోగైనా చనిపోయినా సమాచారం తెలుసుకుని నేరుగా ఆస్పత్రికే వెళ్లిపోతున్నారు. ఎవరినీ రాకుండా అడ్డుకోవడంతో పాటు రూ.లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు. చివరకు రూ.70 వేలు, 80 వేలకు ఒప్పందం చేసుకొన్న తరువాతే అంబులెన్స్‌ సేవలందిస్తున్నారు. 

చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. 
కరోనా మహమ్మారి దెబ్బకు నెలలుగా బయట అడుగు పెట్టలేని పరిస్థితి. నిరుపేదలు కాస్తాకూస్తో దాచుకున్న సొమ్ములన్నీ అయిపోగా.. ఇప్పుడు ఎవరైనా కరోనా బారిన పడినా, లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్నా ఆస్పత్రులకు తరలించడం పెద్ద గగనమైపోయింది. ఒకవేళ చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి వస్తే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తోంది. ఆస్పత్రుల్లో కింది స్థాయి సిబ్బందికి చేతులు తడపాలి. ఒకవేళ చనిపోతే అంబులెన్స్‌ వాడికి వేలల్లో ఇచ్చుకోవాలి. అక్కడి నుంచి ఎలాగోలా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించాలంటే శ్మశాన వాటిక నిర్వాహకులు పెట్టే షరతులకు భయపడి, వారు అడిగినంత మేరకు ఒక్కో మృతదేహానికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ముట్టజెప్పాల్సి వస్తోంది. 

బెంగళూరుకు రూ.70 వేలా? 
అనంతపురం నుంచి బెంగళూరుకు 210 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి అక్కడికెళ్లి రావాలంటే 420 కిలోమీటర్లు అవుతుంది. లీటర్‌కు 13 కిలోమీటర్లు వేసుకున్నా.. 33 లీటర్ల డీజిల్‌ అవసరమవుతుంది. లీటర్‌ డీజిల్‌ రూ.80 అనుకున్నా రూ.3 వేలకు మించదు. కరోనాకు ముందు బెంగళూరుకు వెళ్లి రావాలంటే రూ.7 వేలు తీసుకునే వారు. ఇప్పటి పరిస్థితుల్లో అంతకు రెట్టింపు అంటే.. రూ.15 వేలు తీసుకున్నా ఏదోలే అనుకోవచ్చు. అయితే కొందరు అంబులెన్స్‌ నిర్వాహకులు మాత్రం ఏకంగా రూ.70 వేల నుంచి లక్ష వరకు డిమాండ్‌ చేస్తున్నారంటే వీరి అత్యాశకు అంతం లేదా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు.  

అధికారులు దృష్టి సారించాలి 
కరోనా రోగుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ఉదారత కనబరుస్తున్నారు. ప్రభుత్వ పరంగా అన్నీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే, ప్రజల్లోనూ చైతన్యం తీసుకువచ్చేలా ఆదేశించారు. కరోన బారినపడ్డ రోగులకు పరీక్షలు, చికిత్స, పాజిటివ్‌ అనే తేలితే క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించడం, వారికి పౌష్టికాహారం అందించడం, డిశ్చార్జ్‌ సమయంలోనూ రూ.2 వేలు ఇవ్వడం, ఒకవేళ ఎవరైనా చనిపోతే అంత్యక్రియల ఖర్చుల కింద రూ.15 వేలు చెల్లించేలా అధికారులను ఆదేశించి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ సమయంలో కొంతమంది అంబులెన్స్‌ నిర్వాహకులు, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు, శ్మశాన వాటికల నిర్వాహకులు కనీస సంస్కారం లేకుండా ప్రవర్తించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వీరి ఆగడాలపై కలెక్టర్, ఎస్పీ, ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు.   

వీడియోలు తీసినా మమ్మల్ని ఏం చేయలేరు 
అనంతపురం రూరల్‌ మండలం నందమూరినగర్‌కు చెందిన బొమ్మయ్య మూర్ఛవ్యాధితో ఈ నెల 25న ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేరాడు. డయాలసిస్‌ పేషెంట్‌ అయిన అతను కోలుకోలేక 27వ తేదీ మరణించాడు. కరోనా పరీక్ష కోసం స్వాబ్‌ తీసిన వైద్యులు.. ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు మృతదేహాన్ని అప్పగించాల్సి ఉండగా, మృతుడి కుమారులు, సోదరుడు ఓ అంబులెన్స్‌ నిర్వాహకుడిని సంప్రదించారు. ఆస్పత్రి నుంచి వారి స్వగ్రామానికి మృతదేహం తరలించడంతో పాటు అంత్యక్రియలు తామే నిర్వహిస్తామని, అందుకు రూ.80 వేలు అవుతుందని బేరం పెట్టాడు. అంత ఇచ్చుకోలేమని కాళ్లపై పడి ప్రాధేయపడినా అంబులెన్స్‌ నిర్వాహకులు ఏమాత్రం కరుణించలేదు. ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న ఒకరిద్దరినుద్దేశించి అంబులెన్స్‌ నిర్వాహకుడు.. ‘మీరు వీడియోలు, ఫొటోలు తీసుకున్నా... మమ్మల్ని ఏం చేసుకోలేరు’ అని బరితెగించి మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.  

>
మరిన్ని వార్తలు