విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా

10 Oct, 2021 05:20 IST|Sakshi
మెడికల్‌ షాపు వెనుక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న అనకాపల్లి వైద్య బృందం

గుట్టుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చట్టవిరుద్ధంగా శస్త్రచికిత్సలు

ఆపరేషన్‌ సమయంలో గిరిజన మహిళల నరకయాతన

పాడేరు మండలం ఈదులపాలెం మెడికల్‌ షాపే కేంద్రం

ఒక్కొక్కరి నుంచి భారీగా డబ్బు వసూలు

కాసుల కోసం కక్కుర్తిపడి ప్రైవేటు వైద్యులు చేస్తున్న కుటుంబ నియంత్రణ (సంక్షేమ) ఆపరేషన్లు గిరిజన మహిళలకు ప్రాణాంతకమవుతున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ వైద్య ముఠా ప్రైవేటుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న వైనం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగు చూసింది. గిరిజన మహిళల అమాయకత్వాన్ని, అవగాహన రాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని.. మత్తు మందు కూడా సరిగా ఇవ్వకుండా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం ఈదులపాలెం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఉన్న సలుగు రోడ్డులో ఓ మెడికల్‌ షాపు వద్ద నెలకు ఒకసారి కుటుంబ సంక్షేమ ఆపరేషన్లను విచ్చలవిడిగా నిర్వహిస్తూ భారీగా డబ్బు గుంజుతున్నారు. చిన్న ఆపరేషన్‌ జరగాలంటేనే మత్తు వైద్య నిపుణులు తప్పనిసరిగా ఉండాలి. అలాంటిది వారు లేకుండానే వైద్యులు, కొంతమంది సిబ్బంది గిరిజన మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 
– పాడేరు

ఒక్కో ఆపరేషన్‌కు రూ.8,500
అనకాపల్లిలో ఓ ప్రభుత్వాస్పత్రికి చెందిన గైనిక్‌ వైద్యుడితోపాటు ఇతర వైద్య సిబ్బంది ముఠాగా ఏర్పడి అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక ఆపరేషన్‌కు రూ.20 వేలు ఖర్చవుతుందని, తామైతే కేవలం రూ.8,500లకే ఆపరేషన్‌ చేస్తామని ప్రచారం చేస్తున్నారు. గతనెలలో కూడా ఈదులపాలెం మెడికల్‌ షాపులో 35 మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈదులపాలెం మెడికల్‌ షాపు వెనుక మహిళలకు ఆపరేషన్లను చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ‘సాక్షి’ ప్రతినిధి అక్కడకు చేరుకుని ఆ తతంగాన్నంతా కెమెరాలో బంధించారు. 

మత్తు సరిగా ఇవ్వకుండానే..
ఆపరేషన్‌ చేసేటప్పుడు మత్తు మందు సరిగా ఇవ్వకపోవడంతో గిరిజన మహిళలు నరకయాతనతో పెద్దపెట్టున ఏడ్చారు. అయినా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వారికి ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్‌ చేశాక వారిని క్షణమైనా కోలుకోనీయకుండా వెంటనే బయటకు తరలించేశారు. మహిళలను జీసీసీడీఆర్‌ డిపో ఆవరణలో, ఆటోల్లో పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆయా గ్రామాలకు తరలించేశారు. వీరికి స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది కూడా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏజెన్సీలో తాత్కాలిక నిషేధం
గిరిజన ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ తాత్కాలికంగా నిషేధం విధించింది. ఏజెన్సీలో జనాభా తగ్గుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లను ప్రస్తుతం నిర్వహించడం లేదు. కోవిడ్‌ నిబంధనలు కూడా ఇందుకు కారణం. అయితే ఆపరేషన్లు చేయాలని గిరిజనుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పాడేరు, అరకులోయ ఆస్పత్రుల్లో ఆపరేషన్‌ థియేటర్లను అందుబాటులోకి తెస్తాం. ఈ నెల 15 నుంచి ఆపరేషన్ల నిర్వహణకు జిల్లా కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్లను పునఃప్రారంభిస్తాం. ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రైవేటు క్లినిక్‌లు, మెడికల్‌ షాపుల్లో మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడం చట్టరీత్యా నేరం. 
–డాక్టర్‌ కె.లీలాప్రసాద్, ఇన్‌చార్జి ఏడీఎంహెచ్‌వో, పాడేరు

నా కుమార్తె ఆపరేషన్‌కు రూ.8 వేలు ఇచ్చాను 
నా కుమార్తె ఆపరేషన్‌కు డాక్టర్‌కు రూ.8 వేలు చెల్లించాను. ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్‌ చేయడం లేదని ప్రచారం జరగడంతో ప్రైవేటు మెడికల్‌ షాపులో ఆపరేషన్‌కు సిద్ధమయ్యాం. మైదాన ప్రాంతాల్లోని పెద్ద ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండడంతో ఈదులపాలెంలోనే నా కుమార్తెకు ఆపరేషన్‌ చేయించా. 
–సీదరి సీతమ్మ, తరగం గ్రామం, దేవాపురం పంచాయతీ, పాడేరు మండలం 

మరిన్ని వార్తలు