కరోనా వేళ.. కాసుల వేట

31 Jul, 2020 12:44 IST|Sakshi

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షల జోరు... ఫలితాల్లో బేజారు

కాసులు కూడేసుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు 

కరోనాను బూచిగా చూపి డబ్బు దండుకుంటున్న వైనం 

ఆస్పత్రిలో చేర్చుకోవడానికే రూ.45 వేలు

చేరాక రోజుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు 

సగం మొత్తానికే బిల్లు... కొన్ని చోట్ల అదీలేదు

 ’సాక్షి’ పరిశోధనలో వెలుగుచూసిన వాస్తవాలు 

‘కరోనా బాధితుడు: హలో..సర్, నేను కరోనాతో బాధపడుతున్నాను. మీ ఆస్పత్రిలో చేరాలనుకుంటున్నాను. బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయా. 
ఆస్పత్రి సిబ్బంది: బెడ్స్‌ ఉన్నాయో లేదో చూడాలి. చెక్‌ చేసి చెబుతాం. 
కరోనా బాధితుడు: ఫీజు ఎంత అవుతుంది. ఎన్నిరోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తారు. 
ఆస్పత్రి సిబ్బంది: అడ్మిషన్‌కి రూ.25 వేలు కట్టాలి. తర్వాత రోజుకు రూ.10 వేలు. ఎన్నిరోజులకు డిశ్చార్జ్‌ చేస్తామనేది చెప్పలేం. వారం రోజుల క్రితం నుంచే చేర్చుకుంటున్నాం. ఇంత వరకూ ఎవరినీ డిశ్చార్జ్‌ చేయలేదు. 
కరోనా బాధితుడు: అవసరమైతే ఆక్సిజన్‌ పెడతారా,
ఏసీ రూమ్‌ ఇస్తారా. 
ఆస్పత్రి సిబ్బంది: ఆక్సిజన్‌ అన్ని బెడ్స్‌కి లేదు. నాన్‌ ఏసీ గదులే ఇస్తాం. 
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందికి, కరోనా బాధితుడికి మధ్య జరిగిన సంభాషణ ఇది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరోనా ఎంతోమంది ప్రాణాలు తీస్తుంటే.. కొందరికి మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. డబ్బు పోయినా ప్రాణం నిలుపుకోవాలని కొందరు తాపత్రయపడుతుంటే... విపత్కర పరిస్థితులను క్యాష్‌చేసుకోవడంలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు నిమగ్నమయ్యారు. నగరంలో పెద్ద ఆస్పత్రులుగా పేర్కొంటున్నవారంతా ఇదే రీతిలో దోపిడీ పర్వం కొనసాగిస్తున్న విషయం సాక్షి పరిశోధనలో వెలుగుచూసింది.  

కలవరపెడుతున్న వైరస్‌ 
జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. సామాజిక వ్యాప్తి కారణంగా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. బుధవారం నాటికి జిల్లాలో  కరోనా బాధితుల సంఖ్య 4111కు చేరింది. ఇప్పటివరకూ 23 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు సహజంగానే బాగా పెరిగాయి. చికిత్స కోసం ఎంతైనా ఖర్చుపెట్టేందుకు వెనకాడటం లేదు. అదే ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారింది. ఇదే అదనుగా ఇష్టానుసారం ఫీజుల రూపంలో పేషెంట్ల నుంచి డబ్బు గుంజేసి... అక్రమార్జనకు తెగబడుతున్నారు. 

జిల్లా కేంద్రాస్పత్రితో పాటు పదకొండు ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌–19 చికిత్సకు అవకాశం కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో మిమ్స్‌ కోవిడ్‌ ఆస్పత్రి, ప్రభుత్వ ఆస్పత్రులు జిల్లా అధికార యంత్రాంగం ఆధీనంలో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి అందరికీ వైద్యం ఉచితంగా అందే ఏర్పాటు చేసింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రులకు కొన్ని రేట్లను కూడా నిర్ణయించింది. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీని గాలికొదిలేసి, నేరుగా డబ్బు తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పలు వురు బాధితులు స్వయంగా సాక్షికి తెలియజేశారు. దీనికి తోడు సాక్షి స్వయంగా చేసిన పరిశోధనలోనూ ప్రైవేటు ఆస్పత్రులు అధికంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు వెలుగుచూసింది. అడ్మిషన్‌ కే రూ.25 వేల నుంచి రూ.45 వేలు తీసుకుంటున్నారు. ఇక రోజుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నవారున్నారు. కొన్ని ఆస్పత్రులు బిల్లు ఇవ్వండం లేదు. మరికొన్ని సగం సొమ్ముకు మాత్రమే బిల్లు ఇస్తామంటున్నాయి. దీనివల్ల బాధితుడికి ఆరోగ్యశ్రీ ఎలాగూ వర్తించకపోగా కనీసం అతను చేయించుకున్న వ్యక్తి గత ఆరోగ్య బీమా కూడా వచ్చే అవకాశాన్ని కోల్పోతున్నాడు. 

పరీక్షల జోరు.. ఫలితాలు బేజారు 
జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు, కేవలం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, సంజీవని బస్సుల ద్వారా రికార్డు స్థాయిలో 4,732 పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు 55, ట్రూనాట్‌ టెస్టులు 238, ర్యాపిడ్‌ యాంటిజన్‌ కిట్ల ద్వారా 4439 పరీక్షలు నిర్వహించారు. వీటిలో ట్రూనాట్‌ టెస్టులద్వారా చేసిన పరీక్షల్లో 64, ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టుల ద్వారా 150 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం జిల్లాలో 2,462 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 458 మంది కోవిడ్‌ ఆస్పత్రుల్లోనూ, 768 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోను, 168 మంది ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు. అయితే ఫరీక్షల ఫలితాల వెల్లడిలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

గాజులరేగకు చెందిన ఒక వ్యక్తికి కరోనా నిర్థారణ పరీక్షలు ఈ నెల 22న నిర్వహించిన వైద్యులు, ఫలితాన్ని మాత్రం ఇప్పటి కీ వెల్లడించలేదు. అనుమానం వచ్చి ఆ వ్యక్తి గ్రామ వలంటీర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్‌ చేయిస్తే పాజిటివ్‌ గా నమోదయ్యింది. కానీ ఆస్పత్రి నుంచి పాజిటివ్‌ అనే నిర్థారణ రిపోర్ట్‌ రానందున అతనిని కోవిడ్‌ ఆస్పత్రికి తరలించలేదు. నేటికీ టెస్ట్‌కు వచ్చిన వ్యక్తిగానే అతనిని ప్రభు త్వ కేంద్రాస్పత్రిలో ఉంచేశారు. పరీక్ష ఫలితం సమాచారం అతనికి రాకపోవడానికి అతని సెల్‌ ఫోన్‌ నంబర్‌ తప్పుగా నమోదు చేయడమే కారణంగా తెలిసింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాక ఆ రోగి ప్రాథమిక కాంటాక్ట్స్‌కు పరీక్షలు చేయడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.

అడిగినంత ఇచ్చి చికిత్స పొందా... 
నేను విజయనగరంలో ఉంటాను. నాకు కరోనా పాజిటివ్‌  వచ్చింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరేందుకు నిర్వాహకులను సంప్రదించాను. అడ్మిషన్‌ చేసుకోవాలంటే రూ.45 వేలు కట్టాలన్నారు. మా ఇంట్లో 60 ఏళ్లు పైబడినవారు, చిన్నపిల్లలు మొత్తం కలిపి 16 మంది ఉన్నారు. వారందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలో వారడిగినంత డబ్బుకట్టి జాయిన్‌ అయ్యాను. 
– కరోనా బాధితుడు.

కఠిన శిక్ష తప్పదు 
కోవిడ్‌ బాధితుల చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే తీసుకోవాలి. అలా కాదని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ డబ్బు వసూలు చేస్తే కఠిన శిక్షలు తప్పవు. అలాంటి వారిపై బాధితులు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన నేరంపై సెక్షన్‌ 188, విపత్తు నివారణ చట్టం ప్రకారం ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులపై కేసు నమోదు చేస్తాం. నేరం రుజవైతే న్యాయస్థానంలో వారికి ఏడాదిపాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.  
– బి.రాజకుమారి, జిల్లా ఎస్పీ

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే తీసుకోవాలి 
ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి ప్రభుత్వం నిర్దే«శించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నట్టయితే చర్యలు తీసుకుంటాం.  కొంతమంది అధికంగా ఫీజులు  వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.  
– జి.నాగభూషణరావు, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు