ప్రైవేటు ల్యాబ్‌ల దందా: మోసం గురో..! 

13 May, 2021 08:45 IST|Sakshi

నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్‌ పరీక్షలు

ఇష్టారాజ్యంగా సొమ్ము వసూలు

పాజిటివ్‌ కేసులకూ.. నెగటివ్‌ రిపోర్టులు

కచ్చితత్వం లేని ఫలితాలతో ఇబ్బందులు

పలమనేరుకు చెందిన ఓ సాప్ట్‌ వేర్‌ ఇంజినీర్‌కు స్వలంగా జ్వరం రావడంతో ఆందోళనకు గురయ్యాడు. కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని స్థానిక మారెమ్మవీధిలోని ఓ ల్యాబ్‌కు వెళ్లాడు. సదరు ఇంజినీర్‌ టెన్షన్‌ను గుర్తించిన ల్యాబ్‌ నిర్వాహకుడు 10నిమిషాల్లో టెస్ట్‌ రిజల్ట్‌ ఇస్తానని, అందుకు రూ.5వేలు చెల్లించాలని స్పష్టం చేశాడు. దీంతో చేసేదిలేక ఆ వ్యక్తిరూ.5వేలు ముట్టజెప్పి పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. 

బైరెడ్డిపల్లెకు చెందిన ఓ రైతుకు ఒళ్లునొప్పులతో కూడిన జ్వరం వచ్చింది. ఇరుగుపొరుగు వారు కరోనా వచ్చిందేమో అని భయపెట్టారు. ప్రభుత్వాస్పత్రిలో పరీక్ష చేయించుకుంటే అందరికీ తెలిసిపోతుందని అతను ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లాడు. ఆ రైతు పరిస్థితిని గమనించిన ల్యాబ్‌ నిర్వాహకుడు రూ.3వేలు ఇస్తేనే కోవిడ్‌ పరీక్ష చేస్తానని తేలి్చచెప్పాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిర్వాహకుడు అడిగింది రైతు చెల్లించుకోవాల్సి వచ్చింది.

జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలు.. కోవిడ్‌ విజృంభణతో జనం బెంబేలెత్తుతున్నారు.. వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు పరుగులు తీస్తున్నారు.. కరోనా టెస్ట్‌లను ప్రభుత్వమే నిర్వహిస్తున్నా పలువురు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల భయాందోళనను ల్యాబ్‌ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు మాత్రమే చేస్తూ ఇష్టారాజ్యంగా నగదు వసూలు చేస్తున్నారు. కచ్చితత్వం లేని ఫలితాలతో కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. నమ్మి వచ్చినవారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.  

పలమనేరు: జిల్లాలో దాదాపు 458 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేని ల్యాబ్‌లలో కోవిడ్‌ పరీక్షలు చేయకూడదు. అయితే పలు ల్యాబ్‌ల నిర్వాహకులు నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. డిమాండ్‌ మేరకు ధరలు పెంచి ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. కోవిడ్‌ నిర్థారణకు ప్రస్తుతం మూడు రకాల పరీక్షలు చేస్తున్నారు. అందులో ట్రూనాట్‌ పరీక్ష ఫలితాలు 24 గంటల్లో వస్తాయి. వీటి కచ్చితత్వం 85శాతంగా ఉంది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలకు ప్రస్తుతం 3రోజులు పడుతోంది. దీని కచ్చితత్వం 90 శాతంగా ఉంది.

ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని కొంతమంది ప్రైవేటు ల్యాబ్‌లలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లకు మొగ్గుచూపుతున్నారు. దీని కచ్చితత్వం కేవలం 70 శాతం మాత్రమే. ప్రభుత్వాస్పత్రుల్లో కోవిడ్‌ టెస్ట్‌కోసం ఆధార్, మొబైల్‌ నెంబర్లను ఐసీఎంఆర్‌( ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) వెబ్‌లో నమోదు చేసి ఐడీ నెంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికీ ఇదే ప్రామాణికం. కానీ ప్రైవేటు ల్యాబ్‌లో ఇవేమీ లేకుండానే పరీక్షలు చేసేసి ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఇందుకోసం ఇష్టానుసారంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. గంటలో ఫలితం కావాలంటే రూ.2వేలు అరగంటలో కావాలంటే రూ.3 వేలు, 10నిమిషాల్లో స్పాట్‌ రిజల్ట్‌ కావాలంటే రూ.5వేలని ప్రజలను పిండేస్తున్నారు. 

ప్రాణాలకే ప్రమాదం 
ప్రైవేట్‌ ల్యాబ్‌లో టెస్ట్‌ చేయించుకున్న పాజిటివ్‌ వ్యక్తులు సొంత వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో  రోగం ముదరబెట్టుకుంటున్నారు. చివరకు ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌ గురై శ్వాస సమస్యలు ఉత్పన్నమైన తర్వాతే ఆస్పత్రులకు వెళుతున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు.  ఇక కొంతమంది పాజిటివ్‌ వ్యక్తులకు కూడా ప్రైవేటు ల్యాబ్‌లలో నెగటివ్‌ రిపోర్టులు వస్తున్నాయి. దీంతో వారు  యథేచ్ఛగా సంచరిస్తూ కోవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు.

దీనిపై పలమనేరు కోవిడ్‌ అధికారి డాక్టర్‌ విశ్వనాథ్‌ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ  ప్రైవేటు ల్యాబ్‌లలో కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నది నిజమేనన్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా  పెద్ద వ్యాపారంగా మారిందని తెలిపారు. ప్రజల భయాన్ని ఆసరాగా తీసుకుని అనధికారికంగా పరీక్షలు చేస్తూ నగదు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు ల్యాబ్‌ల దందాను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు.

చదవండి: ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’  
1.81 లక్షల ఎకరాలకు ‘సత్వర’ ఫలాలు

>
మరిన్ని వార్తలు