దోపిడి దోమ

25 Jul, 2022 08:05 IST|Sakshi

రాయదుర్గంలోని నేసేపేటకు చెందిన సిద్ధన్న అనారోగ్యానికి గురై ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లాడు. అతడి సలహా మేరకు ఓ సీనియర్‌ వైద్యుడి దగ్గరకు వెళితే.... రోగి చెబుతున్నది వినకుండానే రక్తపరీక్షలు చేయించుకుని రమ్మంటూ ఓ చీటి రాసి చేతిలో పెట్టాడు. దీంతో సిద్ధన్న ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌కు వెళితే.. రోగ నిర్ధారణ పరీక్షకు అక్షరాల రూ.950 బిల్లు అయింది. ల్యాబ్‌ నిర్వాహకుడు ఇచ్చిన రిపోర్టు తీసుకుని తిరిగి సదరు డాక్టర్‌ వద్దకు వెళితే...  సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపి మందులు రాసిచ్చాడు. ఈ తరహా దోపిడీతో వైద్యులు, ల్యాబ్‌ నిర్వాహకులు కలిసి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు.  

రాయదుర్గం: జిల్లాల్లో సీజనల్‌ వ్యాధులు మొదలయ్యాయి. దోమ కాటుతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. దీనికి తోడు రోగ నిర్ధారణకు సంబంధించి ప్రైవేట్‌ ల్యాబ్‌ నిర్వాహకుల వైఖరి మరీ దారుణంగా మారింది. రక్తాన్ని పీల్చే దోమ కాటుతో కోలుకోవచ్చు కానీ, నగదు కొల్లగొడుతున్న దోపిడీ దోమల దెబ్బకు రోగులు ఆర్థికంగా కుదేలవుతున్నారు.  

భయాన్ని సొమ్ము చేసుకుంటూ..  
సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ వైద్యుడి దగ్గరకు వెళ్లినా.. రోగ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి అంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షకు సంబంధించి రిపోర్టులు లేకుంటే వైద్యం చేయలేని అసహాయ స్థితికి వైద్యులు చేరుకున్నారంటే పొరబడినట్లే. కన్సల్టెంట్‌ ఫీజు రూపంలో కొంత దండుకునే వైద్యుడు... రోగ నిర్ధారణ పరీక్షలకు రెఫర్‌ చేయడం ద్వారా మరికొంత కమీషన్‌ దక్కుతుండడమే ఇందుకు కారణం. విష జ్వరాలపై ప్రజల్లో ఉన్న భయాన్ని తెలివిగా దోపిడీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన ల్యాబ్‌లు 79 ఉండగా... అనధికారికంగా నిర్వహిస్తున్నవి దీనికి రెట్టింపుగానే ఉన్నాయి.  

ఉచితంగా అందుబాటులో ఉన్నా.. 
మలేరియా, టైఫాయిడ్‌తో  పాటు గర్భిణులకు బ్లడ్‌ గ్రూపింగ్, హెచ్‌ఐవీ, బ్లడ్‌ షుగర్, హైపటైటిస్‌–బీ, యూరిన్, టీబీ పరీక్షలతో పాటు డెంగీ, ప్లేట్‌లేట్‌ కౌంట్, కిడ్నీ, లివర్‌ ఫంక్షన్‌ లాంటి ఇతర కీలక వ్యాధుల నిర్ధారణకు అవసరమైన పరీక్షలు ప్రాథమిక, అర్బన్‌ ప్రైమరీ ఆరోగ్య కేంద్రాల్లోనే నిర్వహిస్తుంటారు. డెంగీ పరీక్ష కోసం పీహెచ్‌సీల్లోనే రక్త నమూనాలు సేకరించి ‘ఎలిసా’ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి పంపిస్తారు. 24 గంటల్లోపు పరీక్ష చేసి రోగికి సమాచారం అందేలా చర్యలూ తీసుకున్నారు.  

ఇష్టారీతిన ఫీజుల వసూళ్లు.. 
ఉమ్మడి జిల్లాలో గడిచిన ఆరేళ్లు పరిశీలిస్తే 1,538 డెంగీ, 816 మలేరియా, 670 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయి. 2017–19 మధ్య డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించి 80 శాతం కేసులు నమోదు కావడం విశేషం. ప్రాణాంతకమైన ఈ రోగాలకు సంబంధించి విధిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇది కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి బిల్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ధరల పట్టికను సంబంధిత ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో తప్పనిసరిగా ప్రదర్శనకు ఉంచాలి.

అయితే అధికారిక పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. పైగా ప్రశ్నించిన రోగుల పట్ల దురుసుగా వ్యవహరించడం, గంటల తరబడి వేచి ఉండేలా చేసి ఇబ్బందులు గురి చేస్తుంటారు. టైఫాయిడ్, మలేరియా లాంటి పరీక్షలకు రూ.180 నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తారు. అయితే ఈ పరీక్షలకు రూ.500 నుంచి రూ.600 వరకూ తీసుకుంటూ రోగుల జేబులు కొల్లగొట్టడం విమర్శలకు దారి తీస్తోంది.  

అనుమతి లేని ల్యాబ్‌లపై చర్యలు
ప్రభుత్వ అనుమతులు లేకుండా ల్యాబ్‌లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడినట్లు తేలితే అనుమతులున్నా  ల్యాబ్‌లను సీజ్‌ చేస్తాం.  
– డాక్టర్‌ ఓబులు, జిల్లా మలేరియా అధికారి, అనంతపురం 

ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోవాలి 
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ఇతర విష జ్వరాల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీని ఉపేక్షించబోం.  
– డాక్టర్‌ విశ్వనాథయ్య, డీఎంహెచ్‌ఓ 

(చదవండి:  ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు  )

మరిన్ని వార్తలు