ప్రయివేట్‌ స్కూళ్లలో పేదలకు ఉచిత ప్రవేశాలు

7 Mar, 2023 09:46 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన వారు (అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలు, దివ్యాంగుల) కోసం 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల(బీసీ, మైనారిటీ, ఓసీ)కు చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు.

రాష్ట్రంలోని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో అర్హత కలిగిన పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించి 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ.1,20,000, పట్టణ ప్రాంతంలో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షికాదాయం రూ.1,44,000లను ప్రాతిపదికగా తీసుకుని వారి కుటుంబాల పిల్లలను అర్హులుగా పరిగణిస్తామని పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాల కల్పనకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు వెల్లడించారు. ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు నమోదుకు షెడ్యూల్‌ కూడా ప్రకటించామన్నారు. అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌(సమగ్ర శిక్ష) దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.

విద్యార్థుల ప్రవేశాలకు షెడ్యూల్‌ 

  • ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల నమోదు తేదీలు: 06.03.2023 నుంచి 16.03.2023 వరకు
  • విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు (ఆన్‌లైన్‌ పోర్టల్‌లో) తేదీలు: 18.03.2023 నుంచి 07.04.2023 వరకు
  • ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ: 09.04.2023 నుంచి 12.04.2023 వరకు
  • మొదటి ఎంపిక జాబితా విడుదల తేదీ: 13.4.2023
  • ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో మొదటి జాబితాలో ఎంపిక కాబడిన విద్యార్థుల ప్రవేశాలను నిర్థారించే తేదీలు: 15.04.2023 నుంచి 21.04.2023 వరకు
  • రెండో ఎంపిక జాబితా విడుదల తేదీ: 25.4.2023
  • రెండో జాబితాలో ఎంపికైన విద్యార్థుల ప్రవేశాలను నిర్థారించే తేదీలు: 26.04.2023 నుంచి 30.04.2023 వరకు

(చదవండి: కార్చిచ్చుకు పక్కా స్పాట్‌)

మరిన్ని వార్తలు