ప్రైవేట్‌ ట్రావెల్స్‌.. దసరా దందా..!

14 Oct, 2021 10:36 IST|Sakshi

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో అధిక చార్జీలు 

పండుగ రద్దీ నేపథ్యంలో దోపిడీ 

ఒక్కో టికెట్‌కు రూ.300 నుంచి రూ.400 అదనం 

ఆందోళనలో ప్రయాణికులు

దసరా రద్దీని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ క్యాష్‌ చేసుకుంటున్నాయి. టికెట్‌ ధరలు అమాంతం పెంచేశాయి. ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. సాధారణ ధరల కంటే అదనంగా ఒక్కో టికెట్‌పై రూ.400 వరకూ వసూలు చేస్తున్నాయి. దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రవాణా శాఖ అధికారుల ఆదేశాలను సైతం ట్రావెల్స్‌ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా మాటలకే పరిమితమయ్యారు. ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. 

చీరాల: విజయదశమి పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లేవారికి దోపిడీ తప్పడం లేదు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ముక్కు పిండి అదనపు చార్జీలు వసూలు చేయడం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దసరా సందర్భంగా ఆర్టీసీతో పాటు రైల్వేలో కూడా రద్దీ నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్‌ బస్సుల నిర్వాహకులు టికెట్‌ ధరలు అమాంతం పెంచేశారు. అడిగేవాళ్లు లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. 

జిల్లావ్యాప్తంగా 600కుపైగా సర్వీసులు... 
జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు చీరాల, మార్కాపురం, కందుకూరు, అద్దంకి, కనిగిరి ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు నిత్యం 600కుపైగా రాకపోకలు సాగిస్తున్నాయి. పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు కూడా నడుపుతున్నాయి. అయితే, ప్రైవేటు ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పండుగ కాస్తా..దండగగా మారిందంటూ నిష్టూరుస్తున్నారు. 

దసరా ఉత్సవాలు, సెలవులతో పెరిగిన రద్దీ... 
కరోనా రెండు దశలను విజయవంతంగా ఎదుర్కొని ప్రజాజీవనం మరలా గాడిలో పడుతోంది. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు జనం వెళ్లివస్తున్నారు. ఈ సమయంలో వచ్చిన దసరా పండుగకు ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. బుధవారం దుర్గాష్టమి నుంచి కార్యాలయాలకు కూడా సెలవులు కావడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ప్రయాణమయ్యారు. దీంతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలకు కాసులు కురిపిస్తోంది. 

చదవండి: (దర్శి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత) 

రెట్టింపు ధరలతో బెంబేలు... 
కరోనా ఉధృతి తగ్గిన అనంతరం వచ్చిన పెద్ద పండుగ కావడంతో వృత్తిరీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్న వారంతా సొంతూళ్లకు బయలుదేరారు. జిల్లాకు చెందిన ఎక్కువ మంది ఉద్యోగ, వ్యాపారాల రీత్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ఆర్టీసీ రెగ్యులర్‌ సర్వీసులను సాధారాణ చార్జీలతో నడుపుతుండగా, పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్‌ వెళ్లేందుకు మాత్రం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక చార్జీలతో కొన్ని బస్సులు నడుపుతున్నారు. కానీ, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారు. రోజువారీ సర్వీసుల టికెట్‌ ధరల కంటే రూ.300 నుంచి రూ.400 అదనంగా వసూలు చేస్తున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ చార్జీ రూ.440 ఉండగా, ప్రైవేటు బస్సుల్లో చార్జీలు ఏసీ రూ.1,300, నాన్‌ ఏసీ రూ.890 తీసుకుంటున్నారు. చీరాల నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు చార్జీ రూ.425 ఉండగా, ప్రైవేటు బస్సు ఏసీ టికెట్‌ రూ.1,200, నాన్‌ ఏసీ బస్సు టికెట్‌కు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. చీరాల నుంచి హైదరాబాద్‌కు 20కిపైగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు నడుస్తున్నాయి.  

నిబంధనలకు చెల్లుచీటీ... 
ప్రైవేటు బస్సుల్లో అధిక ధరలకు టికెట్లు విక్రయించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ.. పండుగ సీజన్లలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు తాపత్రయపడుతున్నాయి. కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తున్నామని బహిరంగ ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఆ దాఖలాలు కనిపించడం లేదు. పండుగ సంగతి ఏలా ఉన్నా ట్రావెల్స్‌ బస్సుల టికెట్‌ ధరలతో ప్రయాణికుల జేబులకు మాత్రం చిల్లు తప్పేలా లేదు. 

303 బస్సులను తనిఖీ చేశాం 
దసరా రద్దీ నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేయకుండా పర్యవేక్షిస్తున్నాం. గడిచిన నాలుగు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 303 బస్సులను తనిఖీ చేశాం. టికెట్‌ ధరలు అధికంగా వసూలు చేస్తున్న దాఖలాలు లేవు. కానీ, ఇతర కారణాలతో 33 కేసులు నమోదు చేశాం. ట్రావెల్స్‌ బస్సుల నిర్వాహకులు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 91542 94502కు ప్రయాణికులు ఫిర్యాదు చేయాలి. అధిక ధరలు వసూలు చేసినట్లు నిర్ధారణ జరిగితే బస్సులు, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. 
– భువనగిరి శ్రీకృష్ణవేణి, రవాణాశాఖ ఉప కమిషనర్, ఒంగోలు 

మరిన్ని వార్తలు