‘కూన’పై స్పీకర్‌కు నివేదిక ఇస్తాం

18 Mar, 2022 04:05 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి, చిత్రంలో కమిటీ సభ్యులు

ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడి

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఈ అంశంపై రవికుమార్‌ను విచారించిన ప్రివిలేజ్‌ కమిటీ

ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న కాకాణి  

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ప్రివిలేజ్‌ (సభాహక్కుల) కమిటీ విచారించింది. ఈ అంశంపై శాసనసభ ప్రస్తుత సమావేశాలు ముగిసేలోపుగానీ, తర్వాతగానీ స్పీకర్‌కు నివేదిక ఇస్తామని ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ గతంలో ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు జారీచేసింది.

వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని అప్పట్లో కూన రవికుమార్‌ కమిటీకి తెలిపారు. శాసనసభ వాయిదాపడ్డాక గురువారం చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన ప్రివిలేజ్‌ కమిటీ సమాశమైంది. కమిటీ సూచన మేరకు వ్యక్తిగతంగా విచారణకు హాజరైన కూన రవికుమార్‌ తాను స్పీకర్‌ తమ్మినేనిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ వివరణ ఆధారంగా కూన రవికుమార్‌ను ప్రివిలేజ్‌ కమిటీ విచారించింది. అనంతరం గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్పీకర్‌పై కూన రవికుమార్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ప్రివిలేజ్‌ కమిటీకి వచ్చిన ఇతర పిటిషన్లపైన కూడా విచారించి  స్పీకర్‌కు నివేదిక ఇస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు