కరెంట్.. ఇక దైవాధీనం కాదు

4 Nov, 2020 03:59 IST|Sakshi

తొమ్మిది గంటలు వచ్చి తీరుతుంది 

చెప్పిన టైంకే ఫీడర్లు ఆన్‌ 

ప్రయోగం సక్సెస్‌.. ఇక కార్యాచరణే 

ఆటోమేషన్‌కు లైన్‌క్లియర్‌ 

రూ.వెయ్యి కోట్లతో ప్రాజెక్టు 

న్యాయసమీక్షకు టెండర్‌ డాక్యుమెంట్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌ ప్రక్రియ వేగవంతమవుతోంది. రూ.వెయ్యికోట్ల కాంట్రాక్టు పనులకు అధికారులు టెండర్‌ నిబంధనలు రూపొందించి న్యాయసమీక్షకు పంపారు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే పనుల్లో మరింత వేగం పుంజుకుంటుంది. సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌ పూర్తయితే తొమ్మిది గంటల పగటి విద్యుత్‌కు మరింత భరోసా లభిస్తుంది. చెప్పినవేళకు ఆటోమేటిక్‌గా వ్యవసాయ విద్యుత్‌ సరఫరా అవుతుంది.  

► సబ్‌స్టేషన్‌లో వ్యవసాయ ఫీడర్లను ఇప్పటివరకు విద్యుత్‌ సిబ్బంది ఆన్, ఆఫ్‌ చేసేవాళ్లు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతుందా? లేదా? అనేదానికి శాస్త్రీయతా కనిపించడంలేదు. ఈ విధానాన్ని సమూలంగా మారుస్తూ సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌కు విద్యుత్‌శాఖ శ్రీకారం చుట్టింది.  
► మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థల పరిధిలోనూ కొన్ని సబ్‌స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఆటోమేషన్‌ చేపట్టారు. ఇవి మంచి ఫలితాలిచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ సరఫరాను పరిశీలించగలిగారు. వ్యవసాయ విద్యుత్‌ లోడ్‌ను శాస్త్రీయంగా తెలుసుకున్నారు. రిమోట్‌ ద్వారా విజయవాడ నుంచి కూడా ఆపరేట్‌ చేయగలమని నిరూపించారు.  
► ప్రయోగం విజయవంతమవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌స్టేషన్లను ఆటోమేషన్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,616 విద్యుత్‌ ఫీడర్ల ద్వారా 17,54,906 వ్యవసాయ పంపుసెట్లకు ఏటా 12,232 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా అవుతోంది. ప్రస్తుతం 1,068 సబ్‌స్టేషన్లలో పూర్తి ఆటోమేషన్‌ చేపడతారు. మిగిలిన వాటిని తరువాత దశలో ఆటోమేషన్‌ చేస్తారు. 

ప్రపంచబ్యాంకు రుణం 
ఆటోమేషన్‌ ప్రక్రియకు వెయ్యికోట్ల వ్యయం అవుతుంది. ఈ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. ఇంటలెక్చువల్‌ ఎల్రక్టానిక్‌ డివైజ్‌ ద్వారా పనిచేసే ఈ సాంకేతికత రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విద్యుత్‌ సరఫరా దైవా«దీనం అనే గత అనుభవాలను పూర్తిగా మారుస్తుంది. ఎవరి ప్రమేయం లేకుండానే ఫీడర్లు ఆన్‌ అవుతాయి. తొమ్మిది గంటల సమయం పూర్తవ్వగానే విద్యుత్‌ సరఫరా ఆగిపోతుంది. పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా అన్ని అనుమానాలు నివృత్తి చేసుకున్నాం. వందశాతం పారదర్శకంగా టెండర్‌ ప్రక్రియ చేపట్టబోతున్నాం.  
– శ్రీకాంత్‌ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి 

నాణ్యత పెరుగుతుంది 
విద్యుత్‌ లోడ్‌ను సాంకేతికంగా తెలుసుకోవచ్చు. దీంతో సబ్‌స్టేషన్‌ పరిధిలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఫలితంగా విద్యుత్‌ సరఫరా నాణ్యత మరింత పెరుగుతుంది. 
– పద్మా జనార్దన్‌రెడ్డి, సీఎండీ, సీపీడీసీఎల్‌   

మరిన్ని వార్తలు