Airport Prakasam District: ‘ప్రకాశం’లో ఎయిర్‌పోర్టు

30 Jan, 2022 03:02 IST|Sakshi
విమానాశ్రయం కోసం అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో గుర్తించిన భూములు

అద్దంకి, తిమ్మాయపాలెం గ్రామాల్లో భూముల పరిశీలన

మ్యాప్‌ సిద్ధం

త్వరలోనే స్థలం నిర్ణయం

అద్దంకి:  ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ వేగ వంతమైంది. కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు 1000 ఎకరాల భూములను గుర్తించడానికి వారం రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం, అద్దంకి ప్రాంతాల్లో తహసీల్దార్‌ జే ప్రభాకర్‌రావు పర్యవేక్షణలో అనుకూలమైన భూములను గుర్తించి, మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ మ్యాప్‌ను శనివారం ఉన్నతాధికారులకు పంపారు. ప్రాథమికంగా అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం అద్దంకి లేదా తిమ్మాయపాలెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానుంది.

అద్దంకి, బొడ్డువానిపాలెం మధ్యలో 1,600 ఎకరాల భూమి పరిశీలన..
అద్దంకి పట్టణంలోని మేదరమెట్ల–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో ధేనువకొండ పునరావాస కాలనీ బలరామకృష్ణపురం సమీపం నుంచి, కొరిశపాడు మండలంలోని బొడ్డువానిపాలెం గ్రామ పొలాలను పరిశీలించారు. ఇక్కడ 1600 ఎకరాల భూమి విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని గుర్తించారు.అందులో 109 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు 1000 ఎకరాలు అవసరం కాగా ప్రభుత్వ భూమిపోను 900 ఎకరాల పట్టా భూములను  కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

తిమ్మాయపాలెం కుంకుపాడు రోడ్డుకు పడమరగా..
మండలంలోని తిమ్మాయపాలెంలో కుంకుపాడు రోడ్డునుంచి, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుంచి వెళ్లే డొంక మధ్యలోని 1,400 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో  311 ఎకరాల డాటెడ్‌ ల్యాండ్‌తోపాటు, వాగులు, వంకలు, డొంకలకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంది. అంటే అవసరమైన 1000 ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమి పోను, 689 ఎకరాల ప్రైవేటు భూములు అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు.   

మరిన్ని వార్తలు