అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా!

12 Aug, 2022 07:09 IST|Sakshi

ధవళేశ్వరం వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత  

కనుచూపు మేర వరదతో మహా సముద్రాన్ని తలపిస్తోంది

ఉప నదులపై ఉన్న ప్రాజెక్టుల్లోనూ గరిష్ట నీటి నిల్వ

గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టులన్నీ ఈ నెలలోనే నిండటం చరిత్రలో ఇదే తొలిసారి 

భద్రాచలం వద్ద 52.4 అడుగులకు చేరిన నీటి మట్టం

కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక 

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది జూలై రెండో వారంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. గోదావరి, ఉప నదుల వరద ఉధృతికి ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో గేట్లు ఎత్తేశారు. సాధారణంగా గోదావరిలో భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌ వరకు ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. దాంతో ఈ ప్రాంతాన్నే అఖండ గోదావరిగా పిలుస్తారు.

కానీ.. ప్రస్తుతం గోదావరి జన్మించే ప్రాంతమైన మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లా త్రయంబకేశ్వర్‌ నుంచి.. సముద్రంలో కలిసే ప్రాంతమైన డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వరకు భారీ వరద ప్రవాహంతో అఖండ గోదావరి మహా సముద్రాన్ని తలపిస్తోంది. గోదావరి బేసిన్‌లో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయడం చరిత్రలో ఇదే తొలిసారని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. 1,465 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరికి ప్రవర, పూర్ణ, మంజీర, పెన్‌గంగ, వార్ధా, ప్రాణహిత, మానేరు, ఇంద్రావతి, శబరి ప్రధాన ఉప నదులు. ఈ నదీ పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. గంగా నది తర్వాత దేశంలో అతి పెద్ద నది గోదావరి. 

ఆదిలోనే ఉగ్రరూపం  
ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ ఏడాది గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. జైక్వాడ్‌ నుంచి బాబ్లీలో అంతర్భాగమైన 11 బ్యారేజీ గేట్లను మహారాష్ట్ర సర్కార్‌ ఎత్తేసి.. దిగువకు వరద నీటిని విడుదల చేస్తోంది. వాటికి సింగూరు, నిజాంసాగర్‌ నుంచి విడుదల చేస్తున్న మంజీర ప్రవాహం తోడవుతుండటంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. అక్కడి నుంచి వదులుతున్న వరదకు కడెం వాగు వరద తోడవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిన గేట్లను ఇప్పటిదాకా దించలేదు.

దానికి దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన సుందిళ్ల, అన్నారం గేట్లు ఎత్తేసి.. దిగువకు వదిలేస్తున్నారు. వాటికి ప్రాణహిత, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు నుంచి వస్తున్న వరద తోడవడంతో మేడిగడ్డ బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తేశారు. అక్కడి నుంచి ఇంద్రావతి జలాలు తోడవడంతో తుపాకులగూడెం, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టుల గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తేశారు. జూలై 8న పోలవరం ప్రాజెక్టు 48 గేట్లు, ధవళేశ్వరం బ్యారేజ్‌ 175 గేట్లను ఎత్తేశారు. ఇప్పటిదాకా వాటిని దించలేదంటే గోదావరి వరద ఉధృతి ఇట్టే తెలుస్తోంది.  

భద్రాచలం వద్ద 55 అడుగులకు చేరే అవకాశం  
ఎగువ నుంచి 13,92,313 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో గురువారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద నీటి మట్టం 52.4 అడుగులకు చేరుకుంది. దాంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం రాత్రికి నీటి మట్టం 53 అడుగులు దాటనుంది. అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 55 అడుగులకు చేరుకుంటుందని అంచనా.

పోలవరం వద్ద హై అలర్ట్‌  
భద్రాచలం నుంచి భారీ వరద వస్తుండటం.. వాటికి శబరి ప్రవాహం తోడవుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తూ.. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 34.050 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. ప్రాజెక్టులోకి 11.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,13,191 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 7,200 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 14,05,991 క్యూసెక్కులను సముద్రంలోకి వదలేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 14.60 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

బిరబిరా కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: కృష్ణా పరీవాహక ప్రాంతం(బేసిన్‌)లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా ప్రధాన పాయపై ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్‌ దాకా అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడం, ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో గేట్లు ఎత్తేశారు. ప్రధాన ఉపనది తుంగభద్రపై కర్ణాటకలోని భద్ర, సింగటలూరు బ్యారేజ్, తుంగభద్ర డ్యామ్, ఆంధ్రప్రదేశ్‌లోని సుంకేశుల బ్యారేజ్‌ గేట్లు ఎత్తేశారు. మరో ఉప నది బీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఒకటి రెండు రోజుల్లో గేట్లు ఎత్తివేయనున్నారు.

ఉప నదులైన ఘటప్రభ, మలప్రభలపై కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టులు, వేదవతిపై కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఆంధ్రప్రదేశ్‌లోని భైరవానితిప్ప ప్రాజెక్టులు నిండిపోయాయి. మూసీ నదిపై హైదరాబాద్‌లోని జంట జలాశయాలు, మూసీ రిజర్వాయర్‌ నిండిపోయాయి. పాలేరుపై ఉన్న పాలేరు రిజర్వాయర్‌ కూడా నిండింది. కృష్ణా బేసిన్‌లో మొత్తం ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వాటి గేట్లు ఎత్తివేయడం చరిత్రలో ఇదే తొలిసారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావంతో బేసిన్‌ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, ఉప నదులు ఉరకలెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి.  

>
మరిన్ని వార్తలు