రాష్ట్రానికి రూ.60 కోట్ల విలువైన ప్రాజెక్టులు

3 Mar, 2021 05:47 IST|Sakshi

కేంద్ర ఎంఎస్‌ఈ–సీడీపీ కమిటీ ఆమోదం  

సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న పరిశ్రమలు–క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం(ఎంఎస్‌ఈ–సీడీపీ) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.59.83 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో రూ.37.59 కోట్లతో సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం మూడు కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ఎంఎస్‌ఈ–సీడీపీ స్టీరింగ్‌ కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బంగారు ఆభరణాల తయారీ క్లస్టర్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రింటింగ్‌ క్లస్టర్, మాచవరంలో పప్పులు తయారీ, వాటి ఉత్పత్తుల క్లస్టర్లలో కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

ఈ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం గ్రాంట్‌ రూపంలో రూ.30.07 కోట్లు ఇవ్వనుంది. దీనికి అదనంగా ఇప్పటికే ఉన్న మూడు పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. మచిలీపట్నంలోని ఆభరణాల పారిశ్రామిక పార్కు, హిందూపురం గ్రోత్‌ సెంటర్, గుంటూరు ఆటోనగర్‌ ఇండ్రస్టియల్‌ పార్కులను రూ. 22.24 కోట్లతో ఆధునీకరించడానికి కేంద్రం తుది ఆమోదం తెలిపింది. ఇందుకు కేంద్రం గ్రాంట్‌ రూపంలో రూ.15.57 కోట్లు సమకూర్చనుంది. మంగళవారం కేంద్ర ఎంఎస్‌ఎంఈ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఎంఎస్‌ఈ–సీడీపీ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జే.సుబ్రమణ్యం, ఏపీఐఐసీ వీసీ, ఎండీ కె.రవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు