AP: టీచర్లకు గుడ్‌న్యూస్‌.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్‌!

6 Aug, 2022 02:52 IST|Sakshi

8 వేలకు పైగా ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా అవకాశం

వెయ్యి మంది ఎస్‌ఏలకు గ్రేడ్‌ 2 హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు

సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌ అమలు కోసమే పెద్ద ఎత్తున పదోన్నతులు

విధివిధానాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

సాక్షి, అమరావతి: పునాది స్థాయి నుంచే అత్యుత్తమ ప్రమాణాలతో నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టి 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను అందుబాటులోకి తెస్తోంది. 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం 8 వేలకుపైగా పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనుంది.

3వ తరగతి నుంచి 7 లేదా 8వ తరగతి వరకు ఉండే ప్రీహైస్కూళ్లలో విద్యార్థులు నిర్ణీత సంఖ్యకు మించి ఉంటే వాటిలోనూ సబ్జెక్టు టీచర్లుగా స్కూల్‌ అసిస్టెంట్లను నియమిస్తారు. ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల నియామకం కోసం 1,000 వరకు ఎస్‌ఏ పోస్టులను గ్రేడ్‌–2 హెచ్‌ఎం పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఎస్‌ఏలకు వీటిలో పదోన్నతి కల్పిస్తారు. ఈమేరకు పదోన్నతుల విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరక్టర్‌ మువ్వా రామలింగం శుక్రవారం సర్క్యులర్‌ రూపంలో విడుదల చేశారు. 

+ 10లోగా సీనియార్టీ జాబితాలు..
ఎస్‌ఏ, గ్రేడ్‌–2 హెడ్మాస్టర్‌ పోస్టులలో పదోన్నతులకు సంబంధించి జిల్లాలవారీగా సీనియార్టీ జాబితాలను ఈనెల 10వ తేదీలోగా రూపొందించాలని రీజినల్‌ జాయింట్‌ డైరక్టర్లు, జిల్లా విద్యాధికారులకు సూచించారు. ఇప్పటివరకు రకరకాలుగా అన్వయించి పదోన్నతులు చేపట్టడం న్యాయ వివాదాలకు దారి తీసినందున ఏకరూప నిబంధనలను అనుసరించాలని స్పష్టం చేస్తూ సర్క్యులర్‌లో పొందుపరిచారు. ఎస్‌ఏ, హెడ్మాస్టర్‌ పోస్టులకు సంబంధించి నిబంధనలున్నాయని, అలాగే కొన్ని వర్గాలకు ఇతర అర్హతలను పరిగణలోకి తీసుకొని పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను అనుసరించి పదోన్నతులు కల్పించాలని స్పష్టం చేశారు. 

– ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో గ్రేడ్‌ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు జోన్, జిల్లాల ప్రాతిపదికన స్కూల్‌ అసిస్టెంట్ల సీనియార్టీని గుర్తించేటప్పుడు ఏపీఎస్‌ఎస్‌ఎస్‌–1996లోని 33, 34 నిబంధనలను అనుసరించాలి.
– పదోన్నతులలో ఏపీ సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధన రూల్‌ 22 పాటించాలి.
– టీచర్ల సీనియార్టీకి పోస్టులో చేరిన తేదీని పరిగణలోకి తీసుకోవడంతో పాటు క్రమబద్ధీకరణ లేదా ప్రొబేషన్‌ పీరియడ్‌ ఆమోదం ఆధారంగా చేపట్టాలి.
– ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమాన్యాల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను పదోన్నతి కోసం కేటాయించాలి. వీటిలో మూడింట ఒక వంతు పోస్టులు డైరెక్ట్‌ ›రిక్రూట్‌మెంటు కోసం మినహాయించాలి.
– ప్రమోషన్‌ ఉత్తర్వులు అందిన తేదీ నుంచి 15 రోజుల్లోగా కొత్త పోస్టులో చేరాలి.
– గతంలో పదోన్నతి వదులుకున్న టీచర్లు జీవో 145 నిబంధనల ప్రకారం పదోన్నతులకు పరిగణిస్తారు.
– కొత్త జిల్లాల ప్రాతిపదికన కాకుండా పాత జిల్లాల ప్రాతిపదికన సీనియార్టీ జాబితాలు రూపొందించాలి. ఆగస్టు 10వ తేదీలోగా దీన్ని పూర్తి చేయాలి.  

ఇది కూడా చదవండి: రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరాలి.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచుదాం: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు