‘ప్రోటీన్ల’ను పట్టించుకోరేమీ!

9 Aug, 2020 05:45 IST|Sakshi

కోవిడ్‌–19 వైరస్‌ను ఎదుర్కొనే  రోగనిరోధక శక్తికి ప్రోటీన్లే కీలకం 

వీటి ఆవశ్యకతను గుర్తించని భారతీయులు 

నిల్సన్‌ సంస్థ సర్వేలో వెల్లడి 

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 వైరస్‌ మహమ్మారిని మన శరీరం ఎదుర్కోవాలంటే.. మనలో రోగనిరోధక శక్తి ఉండాలి. ఇందుకు ‘ప్రోటీన్లు’ అత్యధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇంతటి కీలకమైన పోషక పదార్థాలపై భారతీయుల్లో సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారతీయ తల్లుల్లో అత్యధికశాతం మంది ఆహారంలో వీటి ఆవశ్యకతను గుర్తించడం లేదని ప్రముఖ సంస్థ నిల్సన్‌ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘ప్రోటీన్లు మన హక్కు’ అనే నినాదంతో దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా.. దేశంలోని మెట్రో, ద్వితీయశ్రేణి నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. నిల్సన్‌ సర్వేలోని ప్రధాన అంశాలు ఇవీ..   

► ప్రోటీన్లపై భారతీయులకు సరైన అవగాహన లేదు. పేదల్లోనే కాదు మధ్యతరగతి, ఉన్నతవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 
► భారతీయులు సగటున తక్కువ పరిమాణంలో పోట్రీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. కేవలం 3శాతం మందికి మాత్రమే వీటి అవశ్యకత తెలుసు. 
► రోగనిరోధక శక్తిని అందించి, కండరాల శక్తిని పెంపొందించడంలో ప్రోటీన్లు కీలకమనే విషయం 90% మంది తల్లులకు తెలియదు. 
► రోజువారి ఆహారంలో 82% మంది తల్లులు ప్రోటీన్లకు తక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.  
► 80% మంది మాతృమూర్తులకు ప్రోటీన్లు ముఖ్యమైనవి అని తెలుసు కానీ రోజూ ఆహారంలో వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు.  ప్రోటీన్లు త్వరగా జీర్ణం కావని.. వీటిని ఎక్కువుగా తీసుకుంటే బరువు పెరుగుతారని.. ఇలా పలురకాల దురభిప్రాయాలు ఉన్నాయి.  

ప్రోటీన్లతోనే ఆరోగ్యభారత్‌  
చిన్నతనం నుంచే ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారం ఇవ్వడం ద్వారానే ఆరోగ్య భారత్‌ను రూపొందించగలమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిల్సన్‌ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు భారతీయులకు కనువిప్పు కలిగించాలని ఇండియన్‌ డయాబెటిక్‌ అసోసియేషన్‌ప్రెసిడెంట్‌ డా.జగ్మీత్‌ మదన చెప్పారు. ‘ప్రోటీన్‌ పారడాక్స్‌’పేరిట నిర్వహించిన ఈ అధ్యయనం దేశానికి సరైన మార్గనిర్దేశం చేసిందని న్యూట్రీటెక్‌ ఇండియా లిమిటెడ్‌ డైరెక్టర్‌ డా.సురేశ్‌ ఇటపు అభిప్రాయపడ్డారు. 

ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారం 
► మొక్కజొన్న, స్వీట్‌కార్న్‌ 
► ఆకు కూరలు
► పాలు
► పెరుగు 
► పప్పు దినుసులు 
► బీన్స్, చిక్కుళ్లు, రాజ్మా, సోయా, కాబూలీ శనగలు 
► వేరుశనగ(పొట్టు తీయకుండా) 
► పుట్టగొడుగు ∙గుడ్లు 
► పళ్లు... ప్రధానంగా సిట్రస్‌ ఉండే దానిమ్మ, నిమ్మ, జామ, దబ్బ,  
► స్కిన్‌లెస్‌ చికెన్, చేపలు  

>
మరిన్ని వార్తలు