రియల్‌ ఎస్టేట్‌ రాజధాని వద్దు.. 

16 Oct, 2022 05:50 IST|Sakshi
చాగల్లులో పాదయాత్రకు ప్లకార్డులు, నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతున్న స్థానికులు

చాగల్లులో అమరావతి పాదయాత్రికులకు నిరసన సెగ   

స్థానికులను రెచ్చగొట్టేలా పాదయాత్రికుల నినాదాలు  

పరిస్థితి ఉద్రిక్తం.. కట్టడి చేసిన పోలీసులు

చాగల్లు: అమరావతి రైతుల పాదయాత్రకు తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో స్థానికుల నుంచి నిరసన ఎదురైంది. శనివారం ఉదయం చాగల్లు మండలంలో ఎస్‌ ముప్పవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఊనగట్ల మీదుగా చాగల్లుకు చేరింది. చాగల్లు మండల వైఎస్సార్‌సీపీ నేతలతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు ఉదయం తొమ్మిది గంటలకే చాగల్లు ప్రధాన కూడలి వద్దకు చేరుకున్నారు.

నల్ల చొక్కాలు, నల్ల కండువాలు ధరించారు. వీరంతా ప్లకార్డులు పట్టుకుని మూడు రాజధానులకు మద్దతు పలుకుతూ అమరావతి యాత్రపై నిరసన వ్యక్తం చేశారు. రియల్‌ ఎస్టేట్‌ రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు, వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి.. అంటూ నినాదాలు చేశారు. నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు.

అమరావతి పాదయాత్రలో కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాల వారూ పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి.. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ పోసిన శ్రీలేఖ, ఏఎంసీ చైర్మన్‌ వల్లభశెట్టి శ్రీనివాసరావు, ఎంపీపీలు మట్టా వీరాస్వామి, జొన్నకూటి పోసిబాబు, కొవ్వూరు మునిసిపల్‌ చైర్మన్‌ భావన రత్నకుమారి, చాగల్లు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు చెల్లింకుల దుర్గామల్లేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, మాజీ సర్పంచ్‌ గండ్రోతు సురేంద్రకుమార్, స్థానికులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు