ఉపాధి అభివృద్ధి.. మూడు జాతీయ స్థాయి అవార్డులు

31 Oct, 2022 17:29 IST|Sakshi

మూడేళ్లుగా ఉపాధి నిధులు రూ.1,419.38 కోట్ల ఖర్చు 

ఉపాధి కూలీలకు వేతనంగా రూ.828.95 కోట్లు

అభివృద్ధి పనులకు  రూ.590.43 కోట్ల నిధుల ఖర్చు 

గ్రామాల్లో పది రకాల అభివృద్ధి పనులు పూర్తి

ఉపాధి కూలీలకు జీవనోపాధి కల్పిస్తూ శాశ్వత నిర్మాణాలతో అభివృద్ధిలో జిల్లా దూసుకెళ్తోంది. మెటీరియల్‌ కాంపోనేట్‌తో గ్రామీణాభివృద్ధిలో భాగంగా పది రకాల భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 60 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఏడాదిలో సుమారు 1.20 కోట్ల పని దినాలు కల్పించడం, అభివృద్ధే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించారు. అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగానికి లక్ష్యాలు నిర్దేశించారు. 

నెల్లూరు (పొగతోట): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు పనులు కల్పించడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి నిధులతో 10 రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు ఉపాధి హమీ పథకం ద్వారా రూ.1,419.38 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు రూ.828.95 కోట్లు వేతనా ల రూపంలో చెల్లించారు. మెటీరియల్‌ కాంపో నేట్‌ ద్వారా రూ.590.43 కోట్లు ఖర్చు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీరోడ్లు, సీసీ డ్రెయిన్లు, రైతుభరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, సచివాలయాలు, బల్క్‌ మిల్క్‌ సెంటర్స్‌ తదితర భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పనులు హాజరయ్యే కూలీలకు రోజుకు ఒక్కొక్కరికి రూ.252 వేతనం చెల్లించాల్సి ఉంది. రూ.252 వేతనం కూలీకి చెల్లిస్తే రూ.171 అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంజూరు చేస్తున్నారు.  

జిల్లాకు మూడు జాతీయ స్థాయి అవార్డులు  
గ్రామాల్లో అవసరం పనులను ఉపాధి హామీ సిబ్బంది ద్వారా గుర్తించి ప్రతి వారం ఆయా పనులను అప్‌లోడ్‌ చేస్తున్నారు. గుర్తించి పనులకు కూలీలు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత నింబంధనల ప్రకారం గుర్తించిన పనులను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంది. ఉపాధి పని దినాలు కల్పించడంలో జిల్లాకు మూడు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1.29 కోట్ల పనిదినాలు కల్పించారు. కూలీలకు వేతనం ద్వారా రూ 266.96 కోట్లు, మెటీరియల్‌ కాంపోనేట్‌కు రూ.132.13 కోట్లు ఖర్చు చేశారు.

ఉపాధి పనులు చేసిన కూలీలకు వారి బ్యాంకు అకౌంట్లలో నగదు జమ అవుతుంది. కూలీలు ఉదయం 6 గంటలకు వచ్చి 10.30లోపు ఉపాధి పనులు పూర్తి చేసుకుని వెను తిరుగుతున్నారు. వ్యవసాయ పనులు అధికంగా జరిగే రోజుల్లో ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య తక్కువగా ఉంటుంది. రాపూరు, వింజమూరు, వరికుంటపాడు, ఉదయగిరి తదితర మండలాల్లో ఉపాధి పనులు అధికంగా జరుగుతున్నాయి. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచి నిర్దేశించిన వేతనం మంజూరు చేయించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు క్రమం తప్పకుండా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సూచనలు సలహాలు ఇస్తున్నారు. డ్వామా పీడీ , అడిషనల్‌  పీడీ నిర్మలారెడ్డి నిత్యం మండల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌లో నిర్వహించి ఉపా«ధి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు. 

1.20 కోట్ల పని దినాలే లక్ష్యం
జిల్లాలోని 37 మండలాల్లో 722 పంచాయతీలు ఉన్నాయి. సుమారు 4.43 లక్షల మంది జాబ్‌కార్డులు కలిగిన కూలీలు ఉన్నారు. ప్రతి రోజు 50 నుంచి 60 వేల మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. గతేడాది 90 వేల నుంచి లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిలో 82 లక్షల పనిదినాలు జిల్లాకు కేటాయించారు. ఇప్పటి వరకు 79 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు 1.10 కోట్ల నుంచి 1.20 కోట్ల పని దినాలు పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య తక్కువగా ఉంది. ఉపాధి పనులతో అభివృద్ధి పనులతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి కూలీకి రూ.252 వేతనం వచ్చేలా పనులు చేయిస్తున్నారు. ఉపాధి పనులు అధికంగా జరిగి కూలీలకు వేతనం అధికంగా చెల్లిస్తే అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. 

కూలీలకు నిర్దేశించిన వేతనం చెల్లించేలా చర్యలు 
జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రతి కూలీలకు రూ.252 వేతనం చెల్లించేలా చర్యలు చేపట్టాం. ఉపాధి పనులు అధికంగా జరిగితే అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. సీసీ రోడ్లు, ఆర్‌బీకేలు, అంగన్‌వాడీ భవనాలు తదితర భవన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 82 లక్షల పని దినాలు కల్పించమని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు 79 లక్షల పనిదినాలు కల్పించాం. ఉపా«ధి పనులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు అధికంగా చేపట్టే అవకాశం ఉంది. 
– వెంకట్రావ్, డ్వామా పీడీ

మరిన్ని వార్తలు