సడన్‌గా లేచి.. కాల్చండని కేకలు

22 Oct, 2020 11:54 IST|Sakshi

ఆన్‌లైన్‌ మొబైల్‌ గేమ్స్‌ ఒక ప్రమాదకరమైన వ్యసనంలా మారాయి. ఆటల పేరుతో యువతను బానిసలుగా మార్చేసి, పిచ్చోళ్లను చేస్తూ కొన్ని కంపెనీలు రూ.కోట్లు దండుకుంటున్నాయి. ఆట మత్తులో హైస్కూల్‌ విద్యార్థుల నుంచి యువకుల వరకూ అంతా బానిసలై తల్లిదండ్రులకు తెలియకుండా రూ.వేలకు వేలు తగలేస్తున్నారు. అడిగిన వెంటనే సొమ్ములు ఇవ్వకుంటే తల్లిదండ్రులను బెదిరిస్తూ ఆత్మహత్యలకు సిద్ధమై, అలవోకగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ గేమ్స్‌పై నిషేధం విధించినా యువత లెక్క చేయడం లేదు.

సాక్షి, శృంగవరపుకోట: క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక వికాసాన్ని అందించేవిగా ఉండాలి. ఆరోగ్యం కోసం ఆటలాడాలంటూ పెద్దలు పిల్లల్ని ప్రోత్సహించేవారు. ఇప్పుడు క్రీడలు అంటే పిల్లలు ఏమైపోతారో అనే ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు సంబంధించి మొన్న పోక్‌మాన్, నిన్న బ్లూవేల్స్, ఇప్పడు పబ్‌జీ, ఫ్రీ ఫైర్‌ గేమ్స్‌ విద్యార్థులను, యువతను వెర్రెక్కించి, ప్రమాదంలోకి నెడుతున్నాయి. విద్యార్థులు, యువకులు గంటల పాటు ప్రమాదకరమైన ఆన్‌లైన్‌ గేమ్స్‌లో మునిగితేలుతున్నారు. ప్రభుత్వాలు కొన్ని గేమ్స్‌ను బ్యాన్‌ చేసినా, కొన్ని సర్వర్ల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని వేలాది మంది డేంజర్‌గేమ్స్‌లో భాగస్వాములు కావడం గమనార్హం.  

ఏమిటీ గేమ్స్‌.. 
పబ్‌జీ దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్‌ కంపెనీ తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ మల్టీప్లేయన్‌ గేమింగ్‌ యాప్‌. ఇదే తరహాలో మరో ఆన్‌లైన్‌ గేమ్‌  ఫ్రీ ఫైర్‌. ఈ గేమ్స్‌ను ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని గేమ్‌లో ప్రవేశించాలి. గేమ్‌ను సింగిల్‌గా లేదా గ్రూప్‌గా ఆడొచ్చు. గేమ్‌లో 100 మంది వరకూ ఉంటారు. ఆడేవారు తప్ప మిగిలిన వారంతా శత్రువులు గానే లెక్క. గేమ్‌ని వార్‌   ఫీల్డ్‌లా భావించి ఎదురుపడ్డ పోటీదారులను చంపుకుంటూ పోవాలి. మిగిలిన వాడు విజేత. ఇందులో మనం ఎంచుకున్న ఆటగాడికి కావాల్సిన దుస్తులు, ఆయుధాలు, బాంబులు, బంకర్లు, మెడికల్‌ కిట్లు అన్నీ అమ్మకానికి ఉంటాయి. దీంతో తమ ఆటగాడికి కావాల్సిన సామగ్రి కొనాలంటే వెంటనే ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేయాలి. ఇలా తమను ఊహించుకుంటూ ఓడిన (చనిపోయిన) ప్రతిసారీ గెలవాలన్న కసితో వేల రూపాయలు తగలేస్తున్నారు.  

పట్టించుకోని ఉన్మాదం..  
ప్రస్తుతం కరోనా ప్రభావంతో స్కూల్స్, కాలేజీలు మూతపడటం, ఆన్‌లైన్‌ క్లాసుల కోసం అని ఇంచుమించుగా ప్రతి విద్యార్థికి ఆండ్రాయిడ్‌ మొబైల్‌ని తల్లిదండ్రులు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవారి సంఖ్య మరింతగా పెరిగింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌లో బానిసలుగా మారిన విద్యార్థులు, యువకులు చదువుల్లో పూర్తిగా వెనుకబడుతున్నారు. నిద్రలేమి, కంటి సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, ఆందోళన, ఓటమిని భరించలేక పోవడం, సొమ్ము కోసం తల్లిదండ్రులను బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటి నేర ప్రవృత్తికి లోనవుతున్నారని, డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యకు తెగిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.  

కొందరు బాధితులు.. 

  • ఎస్‌.కోటకు చెందిన విజయ్‌సాయి(పేరు మార్చాం) కొద్ది నెలల క్రితం పబ్జీ, ఫైర్‌ ఫ్రీ గేమ్స్‌ ఆడేందుకు అలవాటు పడ్డాడు. క్రమంగా గేమ్స్‌లో మునిగితేలాడు. ఆటలో మదుపు పెట్టేందుకు తండ్రికి తెలియకుండా రూ.వేలల్లో ఖర్చు పెట్టాడు. డబ్బులు పోయి, డబ్బులు ఖర్చులకు లేక వింత పోకడతో వ్యవహరించడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు వైద్యుణ్ని సంప్రదించారు. సైక్రియాటిస్ట్‌  అతడిని గేమ్స్‌కు దూరంగా ఉంచాలని, ప్రస్తుతం ఏ విషయంపై ఒత్తిడి చేయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మందులు ఇచ్చారు. 
  • ఎస్‌.కోటకు చెందిన ఓ 12 ఏళ్ల విద్యార్థి అభిజ్ఞకుమార్‌ (పేరు మార్చాం) ఆన్‌లైన్‌ గేమ్స్‌కు  అలవాటు పడ్డాడు. ఇప్పుడు రాత్రివేళ నిద్రలో సడన్‌గా లేచి పరుగెడుతున్నాడు.. ‘కాల్చండి.. కాల్చండి’  అంటూ కేకలు పెడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి 
ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడకుండా పిల్లలను నియంత్రించాలి. వారి భవిష్యత్‌ దెబ్బతినే పరిస్థితి రాకుండా గమనించాలి. అవసరం లేకుండా ఫోన్లు కొని ఇ వ్వకూడదు. గంటలకొద్దీ ఫోన్‌లతో గడిపేటప్పు డు వారి మానసికి స్థితిని గమనించాలి. ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్ల పిల్లలు, యువకుల్లో ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. ఆత్మహత్యలకు సిద్ధమౌతున్నారు. – బి.శ్రీనివాసరావు, ఎస్‌.కోట సర్కిల్, సీఐ

మానసికంగా బలహీనులౌతారు  
మొబైల్‌ గేమ్స్‌ ఆడడంతో ఒత్తిడికి గురై మానసికంగా బలహీనం అవుతారు. దృష్టిలోపం, ఆత్మన్యూనత,  జ్ఞాపకశక్తి కోల్పోవడం, భయం, ఆందోళనకు గురవడం, కోపానికి గురికావడం, స్వీయ నియంత్రణ కోల్పోవడం జరుగుతాయి. వీలైనంత త్వరగా వారిని ఆ వ్యససం నుంచి బయటకు రప్పించేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. – డాక్టర్‌ జి.మృదుల, హోమియో వైద్యాధికారి, ఎస్‌.కోట

ఆన్‌లైన్‌ గేమ్స్‌తో సమస్యలు  
ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ కదలకుండా ఒకే చోట ఎక్కువ సమయం గడపడం వల్ల కండరాల వృద్ధి ఆగిపోతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోతారు. ఏకాగ్రత దెబ్బతింటుంది. కోపం, ఉద్రేకం అధికమౌతాయి. శారీరక, మానసిక రుగ్మతలకు గురౌతారు. వాళ్లని గమనించి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు దూరంగా ఉంచాలి. – డాక్టర్‌ ఎస్‌.వి.సత్యశేఖర్, జనరల్‌ సర్జన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు