సమ న్యాయంలో ఏపీ టాప్‌

1 Nov, 2020 05:01 IST|Sakshi

తొమ్మిదో స్థానం నుంచి ఏడాదిలోనే అగ్రస్థానంలోకి..

ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం

సంక్షేమ పథకాలతో పేదలు, మహిళల ఆర్థిక, సామాజిక ప్రగతి

పీఏఐ–2020 సర్వేలో వెల్లడి.. నివేదికను ప్రకటించిన పీఏసీ

సాక్షి, అమరావతి: దేశంలో ఆర్థిక, సామాజిక, లింగ సమానత్వం/సమ న్యాయంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలోనూ, మొత్తమ్మీద (ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌)లో తృతీయ స్థానంలో నిలిచిందని పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఇండెక్స్‌ (ప్రజా వ్యవహారాల సూచీ–పీఏఐ)–2020 వెల్లడించింది. ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ గతంతో పోల్చితే ప్రగతి చూపినట్టు ప్రముఖంగా ప్రస్తావించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పబ్లిక్‌ ఎఫైర్స్‌ సెంటర్‌ (పీఏసీ) దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిపాలన తీరు తెన్నులపై అధ్యయనం చేసి పబ్లిక్‌ ఎఫైర్స్‌ సూచీ–2020ని శనివారం ప్రకటించింది. వివిధ సామాజిక అంశాలపై ఈ సంస్థ పరిశోధనలు, అధ్యయనాలు చేయడంలో ప్రసిద్ధి చెందింది. 23 అంశాల ఆధారంగా ఆర్థిక, సామాజిక, లింగ సమానత్వంలో ప్రగతిని అంచనా వేసి  ఫలితాలు వెల్లడించినట్టు సంస్థ ప్రకటించింది. ఆయా అంశాల్లో పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వేర్వేరు విభాగాలుగా అధ్యయనం చేసి ర్యాంకులను ప్రకటించింది. 

పెద్ద రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం
1 పెద్ద రాష్ట్రాల విభాగంలో సమానత్వం/సమ న్యాయం విషయంలో పీఏఐ ర్యాంకింగ్స్‌ 2019లో దేశంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ 2020లో శరవేగంగా ప్రథమ స్థానంలోకి రావడాన్ని సంస్థ ప్రముఖంగా ప్రస్తావించింది. 
2  రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మహిళలకు పెద్దఎత్తున అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు శరవేగంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైనట్టు నిపుణులు విశ్లేషించారు.
సమ న్యాయం విషయంలో 2020 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ (0.652 పాయింట్లతో) కేరళ (0.629), ఛత్తీస్‌గఢ్‌ (0.260 పాయింట్లలో) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
2019తో పోల్చితే మధ్యప్రదేశ్, ఒడిశా, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ నెగిటివ్‌ సూచీలతో అట్టడుగు స్థానాలకు దిగజారాయి. ఇదే అంశంలో చిన్న రాష్ట్రాల విభాగంలో మేఘాలయ, హిమాచల్‌ ప్రదేశ్, మణిపూర్‌ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. 
వృద్ధి విషయంలో కేరళ గతంలో ఉన్న మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా కర్ణాటక మూడో స్థానం నుంచి రెండో స్థానంలోకి ఎగబాకింది. వృద్ధి విషయంలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నాయి.

మూడు అంశాలు ప్రాతిపదికగా
సమన్యాయం, వృద్ధి, సుస్థిర అభివృద్ధి అనే మూడు అంశాలను ప్రాతిపదికగా రాష్ట్రాలకు ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌ ఇచ్చినట్టు పీఏసీ పేర్కొంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు