బాబు ప్రోద్బలంతో నిమ్మగడ్డ దుస్సాహసం

10 Jan, 2021 03:52 IST|Sakshi

వివిధ ప్రజా సంఘాల నేతల ధ్వజం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యూహాత్మకంగా కుట్రలు పన్నుతున్నారని వివిధ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పుపడుతున్నారు. రాజకీయ పార్టీల నేతలతో కనీసం సంప్రదించకుండా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఏకపక్షంగా ప్రకటించడం సరికాదంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకున్న నిమ్మగడ్డ.. చంద్రబాబు ప్రోద్బలంతో ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చి ఎవరినీ సంప్రదించకుండా నిమ్మగడ్డ వాయిదా వేశారని.. ఇప్పుడు ఎన్నికలకు సరైన సమయం కాదని అన్ని వర్గాల వారు చెబుతున్నా వినకుండా అడుగులు వేస్తున్న రమేశ్‌కుమార్‌ను నడిపిస్తున్నది ప్రతిపక్ష పార్టీయేనని ఆ నేతలు వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పండుగలా కొనసాగుతోందని.. 11న అమ్మఒడి పథకం కింద డబ్బులు చెల్లించే కార్యక్రమం జరగనుందని.. ఇవి ప్రజలకు అందకుండా చేసేందుకే పన్నాగాలు పన్నుతున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తీరుపై శనివారం వివిధ సంఘాల నాయకులు ఏమన్నారంటే..

నిమ్మగడ్డపై సుమోటోగా కేసు పెట్టాలి
రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చంద్రబాబు దర్శకత్వంలో నిమ్మగడ్డ రమేశ్‌‡ యాక్షన్‌ చేస్తున్నారు. ఈయనపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి. సంక్షేమ పథకాలను ముందుకు సాగనివ్వకుండా చేయాలని.. ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
– డేరంగుల ఉదయకిరణ్, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు

సీఎం సంకల్పాన్ని అడ్డుకోలేరు
అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలన్న సీఎం జగన్‌ సంకల్పాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రభుత్వాన్ని శాసిస్తానంటూ అడుగులు వేస్తున్న రమేశ్‌కు గుణపాఠం తప్పదు.  – ఎ.సూరిబాబు, చైర్మన్, కళింగ వైశ్య కార్పొరేషన్‌

చంద్రబాబు కుట్రలు సాగవు
సంక్షేమాన్ని అడ్డుకునేందుకు నిమ్మగడ్డను టీడీపీ వాడుకుంటోంది. చంద్రబాబు కుట్రలు వైఎస్‌ జగన్‌ పాలనలో సాగవు.
– వడిత్యా శంకర్‌నాయక్, జాతీయ అధ్యక్షుడు, గిరిజన ప్రజా సమాఖ్య  

మరిన్ని వార్తలు