‘ఈనాడు’పై ఆగని నిరసన జ్వాల 

25 Feb, 2023 03:08 IST|Sakshi
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ‘ఈనాడు’ ప్రతులను తగులబెడుతున్న ప్రజలు

రామోజీ తప్పు ఒప్పుకున్నా... చంద్రబాబుది మాత్రం అదే తీరు 

సవాళ్లు చేసి గన్నవరానికి వెళ్లి మరీ ఘర్షణకు పాల్పడ్డ పట్టాభి 

పోలీసులు అరెస్టు చేయటంతో కొట్టకపోయినా.. నానా యాగీ 

పట్టాభిని కొట్టారంటూ పాత ఫొటోలతో రెచ్చగొట్టిన ‘ఈనాడు’  

అంతా దుమ్మెత్తి పోయటంతో తప్పయిపోయిందని అంగీకారం 

కానీ... శుక్రవారం గన్నవరం వెళ్లి చంద్రబాబు నాయుడి శివాలు 

పట్టాభిని కొడతారా.. ఇప్పుడు రండంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు 

ఒక అబద్ధాన్ని నిజం చెయ్యటానికి బాబు, ఎల్లో మీడియా తంటాలు 

అబద్ధమని తేలాక కూడా బాబు ఇలా చేయటంపై సర్వత్రా విస్మయం 

రెండ్రోజులుగా ‘ఈనాడు’ ప్రతుల్ని తగలబెడుతున్న జనం 

శుక్రవారం సైతం రాష్ట్రంలో కొనసాగిన ఆగ్రహ జ్వాలలు  

సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్‌:  ‘వంశీ సంగతి నేనే స్వయంగా తేలుస్తా.. ఏమనుకుంటున్నాడో నేనంటే ఏమిటో చూపిస్తా’ అని మరీ సవాలు చేసి.. గన్నవరం వెళ్లి రచ్చ చేసి.. ఎమ్మెల్యే వంశీ వర్గీయులను రెచ్చగొట్టింది టీడీపీ నేత పట్టాభి. ఇది పద్ధతి కాదని చెప్పబోయిన వంశీ అనుచరులపై బరితెగించి దాడులకు పాల్పడిందే కాక.. గొడవ నివారించడానికి వచ్చిన పోలీసులపైకీ రాళ్లు రువ్విందీ పట్టాభి అండ్‌ కో. ఆ దాడిలో సీఐ కనకారావు గాయపడ్డాక.. పట్టాభి, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాతి నుంచి ఎల్లో మీడియా విష ప్రచారం శ్రుతిమించి సాగింది. పట్టాభిని పోలీసులు ఇష్టానుసారం కొట్టారంటూ దుష్ప్రచారం చేశారు.‘ఈనాడు’ మరో అడుగు ముందుకు వేసి.. పట్టాభినీ కొట్టారంటూ పాత ఫొటోలతో ఓ తప్పుడు కథనాన్ని పతాక శీర్షికన ప్రచురించింది. అవి 2021లోని ఫొటోలని జనం సోషల్‌ మీడియా ద్వారా బయటపెట్టారు. దీంతో తేలు కుట్టిన దొంగలా ఎక్కడో లోపలి పేజీలో ‘సవరణ’ వేయడం ద్వారా ఈనాడు తన తప్పు ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

అవి పాత ఫొటోలేనని, సాంకేతిక కారణాల వల్ల అవి పొరపాటున ప్రచురిత మయ్యాయని లెంపలేసుకుంది. ఈనాడు రెండు నాల్కల ధోరణిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారిలో చర్చ మొదలైంది.  ‘రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు మరీ ఇంత దిగజారిందా.. చంద్రబాబు కోసం తన  పరువు తీసుకోవడానికి సైతం సిద్ధపడటం ఏ పాత్రికేయ ప్రమాణాలకు నిదర్శనం..’ అని జోరుగా చర్చించుకున్నారు.

ఈ క్రమంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు ఈనాడు పత్రిక ప్రతులను దహనం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇంత జరిగాక కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన తీరు మార్చుకోలేదు. తగుదునమ్మా అంటూ శుక్రవారం గన్నవరం వెళ్లారు. పట్టాభిని కొడతారా.. అంటూ నిలదీశారు.

పట్టాభిని పోలీసులు కొట్టలేదని తెలిసినా.. అబద్ధాన్ని నిజం చేయాలని పదే పదే ప్రస్తావిస్తూ పరితపించిపోయారు. ఇప్పుడు రండి చూసుకుందాం.. అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై కూడా నోరు పారేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎల్లో ఈనాడు, మిగతా మీడియా మరోసారి పెద్ద ఎత్తున అవాస్తవాలకు పెద్దపీట వేస్తూ ప్రచారం చేస్తోంది.

నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నిందలు వేస్తున్న తీరును ప్రజలు గమనిస్తూ నిప్పుడు చెరుగుతున్నారు. ఈ క్రమంలో ‘ఈనాడు’ పత్రిక ప్రతుల దహనం కార్యక్రమం శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది.
  
పాత్రికేయ వృత్తికే అవమానం 
ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘ఈనాడు’ పత్రిక అసత్య కథనాలు వండి వారుస్తోందని, వారికి అనుకూలమైన చంద్రబాబును సీఎంను చేయాలనే కుట్రతో పాత్రికేయ వృత్తికే అవమానం కలిగేలా దిగజారుడు వార్తలు ప్రచురిస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా నిరసన ఎగసిపడింది. అది చంద్రబాబు కరపత్రిక అని ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నేతలు నినదించారు.

అనంతపురంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయం ఎదుట ఈనాడు ప్రతులను దహనం చేశారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేసి సమాజంలో జర్నలిజం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన పత్రిక ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు. గోరంట్ల, రాప్తాడు, పెనుకొండలో కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు.

చిత్తూరు జిల్లా సదుం, శ్రీరంగరాజపురం, ప్రకాశం జిల్లా దర్శి, గిద్దలూరు, నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూరులో ‘ఈనాడు’ ప్రతులను దహనం చేశారు. గుంటూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన విద్యార్థి నేతలు అనంతరం అక్కడి నుంచి శంకర్‌విలాస్‌ సెంటర్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

మాచర్ల, చిలుకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండలో ఈనాడు ప్రతులు, రామోజీ చిత్రపటాలను దహనం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం, మైలవరంలో రామోజీ దిష్టి బొమ్మను దహనం చేశారు.
గుంటూరు నగరంలోని లాడ్జిసెంటర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం నేతలు  
 
అసత్య కథనాలు రాస్తే సహించేది లేదు 
ఉన్నతాశయంతో పని చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విషపు రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఏలూరులో ప్రజలు మండిపడ్డారు. ఏలూరు, గాలాయగూడెం, నూజివీడు, భీమడోలు, భీమవరంలో ఈనాడు ప్రతులను దహనం చేశారు. కాకినాడలో రామోజీ దిష్టిబొమ్మను ఊరేగించారు.

కిర్లంపూడి మండలం జగపతినగరంలో ప్రధాన రహదారిపై కాకినాడ ఎంపీ వంగా గీత, తదితర నేతల ఆధ్వర్యాన ఈనాడు ప్రతులను దహనం చేశారు. రామోజీరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని పిఠాపురంలో పలువురు డిమాండ్‌ చేశారు. తుని, కోటనందూరు, ఒంటిమామిడి జంక్షన్, పెద్దాపురం, సామర్లకోటలో నిరసన తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అయినవిల్లి మండలం పోతుకుర్రులో ఈనాడు ప్రతులను దహనం చేశారు.

విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, హిరమండలం, నరసన్నపేట, పలాస తదితర ప్రాంతాల్లోఈనాడుపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బొబ్బిలి, కురుపాం, విశాఖ నగరంలో పలుచోట్ల ఈనాడు పత్రిక ప్రతులను తగులబెట్టారు.   

మరిన్ని వార్తలు