ఒక్కో పోస్టుకు 48 మంది పోటీ

31 May, 2022 05:40 IST|Sakshi

31 సీఎస్‌ పోస్టులకు 1,483 మందితో ప్రాథమిక మెరిట్‌ జాబితా 

సాక్షి, అమరావతి: ప్రజారోగ్య విభాగంలో 31 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌(సీఎస్‌) పోస్టుల నియామకానికి ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నియామక ప్రక్రియలో భాగంగా 1,483 మంది అభ్యర్థులతో ప్రాథమిక మెరిట్‌ జాబితా ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సుమారు 48 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ప్రాథమిక మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ తుది గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

అభ్యర్థులు casrecruitmentdphfw2022@gmail.com మెయిల్‌ ఐడీకు అభ్యంతరాలు పంపాల్సి ఉంటుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ హైమావతి తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కొరతకు తావుండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజారోగ్య విభాగం పరిధిలో 2019 నుంచి 929 వైద్యుల భర్తీ చేపట్టింది. ఇందులో 899 పోస్టుల భర్తీ పూర్తవగా, మిగిలిన 31 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తున్నారు. అదే విధంగా 4,520 పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతివ్వగా ఇప్పటికే 4,315 పోస్టుల భర్తీ పూర్తయింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.  

మరిన్ని వార్తలు