‘లాక్‌డౌన్‌ మంచిదే, తర్వాత ఏంటన్నదే ప్రశ్న’

12 May, 2021 03:33 IST|Sakshi

బ్రిటన్‌ వేరియంట్లపై జాగ్రత్త పడాల్సింది

బ్రిటన్‌లో గతేడాది సెప్టెంబర్‌లోనే కొత్త వేరియంట్లు వచ్చాయి

అవి జనవరిలో మన దేశంలోకి ప్రవేశించాయి.. ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో బాగా వ్యాప్తి చెందాయి

అంతర్జాతీయ ప్రయాణాలు నిలిపివేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంత ఉధృతి ఉండేది కాదు

మొదటి వేవ్‌ తర్వాత ఏమరుపాటు వహించడం వల్లే ఈ ఉపద్రవం

ఉత్సవాలు, ఎన్నికలు, జన సమూహాలే వైరస్‌ వ్యాప్తికి కారణాలు

‘సాక్షి’తో పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: ‘ఈ ఏడాది జనవరిలోనే బ్రిటన్‌కు చెందిన ప్రమాదకర వేరియంట్స్‌ భారతదేశంలోకి ప్రవేశించాయి. అప్పుడే వీటిని నిలువరించి ఉంటే ఇప్పుడింత ఉపద్రవం వచ్చేది కాదు. అవే ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత వ్యాప్తిలో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందాయి. అప్పట్లోనే అంతర్జాతీయ రాకపోకలను నిలిపివేసి.. ఆయా రాష్ట్రాల్లో తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి అదుపులో ఉండేది. ఏమరుపాటు వల్ల చేయి దాటిపోయింది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదు’ అంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణులు, ఢిల్లీలోని ఎయిమ్స్‌ కార్డియాలజీ మాజీ విభాగాధిపతి, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి. దేశంలో కరోనా ఉధృతికి దారి తీసిన పరిస్థితులపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

మేళాలు.. ఎన్నికలు.. జన సమూహాలే కారణం
జనవరిలో బ్రిటన్‌ నుంచి వచ్చిన వేరియంట్స్‌ దేశంలో బాగా వ్యాప్తి చెందాయి. వీటిపై జాగ్రత్త పడకపోగా మేళాలు, రాష్ట్ర స్థాయి ఎన్నికలు, స్థానిక ఎన్నికల పేరిట సుదీర్ఘ ప్రక్రియ సాగింది. వాటిలో జన సమూహాలు ఎక్కువగా భాగస్వామ్యం కావడంతో వైరస్‌ వ్యాప్తికి తలుపులు బార్లా తెరిచినట్టయింది. 

మొదటి వేవ్‌ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం
2020 నవంబర్‌ నాటికి మొదటి వేవ్‌ తగ్గింది. జనవరి నాటికి జనంలో కోవిడ్‌ అంటే భయం పోయింది. మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు. ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించాయి. ప్రమాదం పొంచి ఉందన్న వాస్తవాన్ని గ్రహించలేకపోయాయి.

యువత ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అయ్యారు
మొదటి వేవ్‌లో లాక్‌డౌన్‌ ఉండటం, స్కూళ్లు, కాలేజీలు మూసివేయడం వల్ల యువకులు ఎక్కువగా బయటకు వెళ్లలేదు. ఉద్యోగులు కూడా వర్క్‌ ఫ్రం హోమ్‌కు పరిమితమయ్యారు. అందుకే మొదటి వేవ్‌లో సంభవించిన మరణాల్లో యువత లేదు. ఇప్పుడు యువతే ఎక్కువగా వైరస్‌కు ఎక్స్‌పోజ్‌ అయ్యారు. పైగా వ్యాప్తి ఉధృతంగా సాగే వేరియంట్స్‌ యువతను బాగా దెబ్బ కొట్టాయి. ఇద్దరు గుమికూడితే వచ్చే వైరస్‌ తీవ్రత కంటే పాతిక మంది గుమికూడితే ఉండే తీవ్రత ఎక్కువ. అదే ఎక్కువ నష్టం చేకూర్చింది.

లాక్‌డౌన్‌ తర్వాత ఏమిటన్నదే ప్రశ్న
లాక్‌డౌన్‌ విధించడం మంచిదే. కానీ లాక్‌డౌన్‌ సడలించాక పరిస్థితి ఏమిటన్నదే మన ముందున్న ప్రశ్న. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత కూడా ప్రజలు అజాగ్రత్తగా ఉంటే లాక్‌డౌన్‌ విధించి ఫలితం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలు విధిగా జాగ్రత్తల్ని పాటించాలి.

టీకా వేస్ట్‌ అంటే కుదరదు
చాలామంది టీకా రెండు డోసులు వేసుకున్నా వైరస్‌ సోకింది. అలాంటప్పుడు టీకా ఎందుకు అనుకుంటున్నారు. అది కరెక్ట్‌ కాదు. టీకా వైరస్‌ను రాకుండా అడ్డుకోలేదు. వచ్చినా నియంత్రించగలదని గుర్తుంచుకోవాలి. టీకా 100 శాతం ఫలితాలను ఇస్తోంది.

థర్డ్‌ వేవ్‌ గురించి ఇప్పుడే ఆలోచన అనవసరం
చాలామంది థర్డ్‌ వేవ్‌కూడా వస్తుందంటున్నారు. ముందు మనమంతా సెకండ్‌ వేవ్‌ నుంచి ఎలా బయటపడాలనే దానిపైనే ఆలోచన చేయాలి. టీకా సామర్థ్యాన్ని పెంచాలి. వైద్యానికి అవసరమయ్యే మౌలిక వసతులు పెంచుకోవాలి. అంతేకానీ.. దీనిని పక్కన పెట్టేసి థర్డ్‌ వేవ్‌ గురించి ఆలోచించడం అనవసరం.  

మరిన్ని వార్తలు