ఒమిక్రాన్‌ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో..

29 Nov, 2021 13:49 IST|Sakshi

ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విజయవాడలోని పటమట రైతుబజార్‌ కిటకిటలాడుతోంది. 20 దుకాణాలను పరిశీలించగా కేవలం 5 దుకాణాల యజమానులు మాత్రమే మాస్క్‌ ధరించారు. అలాగే.. ఓ దుకాణానికి 10 మంది వినియోగదారులు వచ్చారు. వీరిలో నలుగురు మాస్క్‌ ధరించలేదు. ఇద్దరు మాస్క్‌ను గడ్డం కిందకు పెట్టుకున్నారు. కేవలం నలుగురే ముక్కు, నోరు కవర్‌ అయ్యేలా మాస్క్‌ పెట్టుకున్నారు. ఇక ఈ పది మందిలో ఒక్కరే చేతులు శానిటైజ్‌ చేసుకున్నారు. 

సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ తరుణంలో వైరస్‌ వ్యాప్తిపట్ల రాష్ట్రంలో ప్రజలు ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారు? నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారు? అని ‘సాక్షి’ వివిధ ప్రాంతాల్లో ఆదివారం పరిశీలిస్తే అక్కడ పరిస్థితులు ఇలా కనిపించాయి..

విజయవాడలోని ఓ ప్రముఖ షాపింగ్‌ మాల్‌లో గంట వ్యవధిలో 67 మంది ప్రవేశించారు. వీరిలో 15 మంది ప్రవేశద్వారం దగ్గరకు రాక ముందు నుంచి మాస్క్‌తో ఉన్నారు. 31 మంది అక్కడకు వచ్చాక జేబులోని మాస్క్‌ తీసి ధరించారు. లోపలికి వెళ్లాక వీరు మాస్క్‌ను తిరిగి జేబుల్లో పెట్టుకోగా, మరికొందరు గడ్డం కిందకు లాగేసుకున్నారు. ఇక మాస్క్‌ లేకుండా లోనికి ప్రవేశించడానికి వీల్లేదని 21మందిని సెక్యూరిటీ సిబ్బంది వారించారు. దీంతో  ఐదుగురు అమ్మాయిలు చున్నీని, 11 మంది అబ్బాయిలు రుమాలును ముఖానికి కట్టుకుని లోపలికి వెళ్లారు. ఐదుగురు అప్పటికప్పుడు మాస్క్‌లు కొని వెళ్లారు.

విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం, విజయవాడ సహా పలు నగరాల్లో విద్యావంతులు మాస్క్‌ లేనిదే బయటికి రావడంలేదు. 

పోలీసుల తనిఖీల్లో మాస్క్‌లు ధరించకుంటే రుసుములు విధిస్తున్నారని.. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లలోకి అనుమతించరనే కారణంతో కొందరు ఆ కాసేపటికి మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నారు.  

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాస్క్‌ వాడకాన్ని మెజారిటీ శాతం తగ్గించేశారు. చాలామంది ఆటోల్లో, ట్రాక్టర్లలో ప్రయాణిస్తున్నప్పుడు  మాస్క్‌లు ధరించడమే మానేశారు.

గతంలో గుంటూరు జిల్లా నరసరావుపేట, తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ, అమలాపురం, చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు  అత్యధికంగా నమోదైనప్పటికీ ఇప్పుడు అక్కడి ప్రజలు సైతం కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు.

మాస్క్‌ పెట్టుకోని వారు ఇలా అంటున్నారు..
రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల నమోదు చాలావరకు తగ్గింది. దీంతో వైరస్‌ ప్రభావం పెద్దగాలేదు కదా..
రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్నాంగా..
మాస్క్‌తో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. సమూహానికి దూరంగా ఉన్నప్పుడు మాస్క్‌ ఎందుకింక..

మాస్క్‌ల వాడకం 80–90 శాతం తగ్గింది
లాక్‌డౌన్‌ రోజులతో పోలిస్తే విద్యా, వ్యాపార, వాణిజ్య ఇతర కార్యకలాపాలు బాగా పెరిగాయి. ప్రజల దృష్టి కరోనా నుంచి పూర్తిగా తొలగిపోయింది. ఈ నేపథ్యంలో మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం బాగా తగ్గించారు. నగరాల్లో ప్రతి 10 మందిలో 5–6 మంది.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2–3 మంది మాత్రమే మాస్క్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన జూలై నెలతో పోలిస్తే మాస్కుల వినియోగం 80–90 శాతం తగ్గిందని అంచనా. 

మాస్క్‌ ధరించే విధానం చాలా ముఖ్యం
వైరస్‌ వ్యాప్తిని మాస్క్‌ ద్వారా అడ్డుకోవచ్చు. మాస్క్‌ పెట్టుకున్న వ్యక్తుల్లోకి వైరస్‌ ప్రవేశించినా తక్కువ లోడ్‌ మాత్రమే వెళ్తుŠంది. చాలామంది మొక్కుబడిగా పెట్టుకుంటున్నారు. నోరు, ముక్కు రెండూ పూర్తిగా కవర్‌ అయ్యేలా మాస్క్‌ ధరిస్తేనే రక్షణగా ఉంటుంది. టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్‌ ప్రభావంలేదని ఎక్కడా రుజువు కాలేదు. కాబట్టి.. వారూ కచ్చితంగా మాస్క్‌లు ధరించాల్సిందే. 
– డాక్టర్‌ హైమావతి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు

తప్పనిసరి అయితేనే గర్భిణులు బయటకు వెళ్లాలి
గర్భిణులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. రెండో దశలో వైరస్‌ బారినపడిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ వ్యక్తుల్లా గర్భిణుల ఊపిరితిత్తుల పనితీరు ఉండదు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు. బాలింతలు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి.
– డాక్టర్‌ ప్రభావతి, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ 

మరిన్ని వార్తలు