అరుదైన రకం.. మేలైన నిర్ణయం!

24 May, 2022 12:32 IST|Sakshi

అరుదైన రకానికి చెందిన పుంగనూరు జాతి ఆవులకు మంచి రోజులు వచ్చాయి. వెయ్యేళ్ల నాటి ఆవుగా గుర్తింపు పొందిన ఈ పొట్టి రకాన్ని అధికంగా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసం ఐవీఎఫ్‌ ల్యాబ్‌తోపాటు సెమన్‌ స్టోరేజీ బ్యాంకును పలమనేరులోనే ఏర్పాటు చేసింది. సరోగసీ పద్ధతిలో పొట్టి జాతి ఆవుల అధికోత్పత్తికి అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతోంది. 

పలమనేరు: ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు జాతికి పేరుంది. ప్రస్తుతం వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే వీటిని అధికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆర్‌కేవీవై ద్వారా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ నిధుల ద్వారా పలమనేరు పశుపరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేయనున్నారు. ఈ ల్యాబ్‌ను నెలరోజుల్లో ప్రారంభించేందుకు ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ 
పలమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్‌ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రం పేరుతో ప్రారంభమైన ఈ పశుపరిశోధన సంస్థ 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇన్‌సైటీవ్‌ కన్సర్వేషన్‌ (స్థానికంగా వీటి సంఖ్యను ఉత్పత్తి చేయడం) దీని లక్ష్యం. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 276 పశువుల వరకు పెరిగినప్పటికీ ఆశించినంత ఉత్పత్తి జరగడం లేదు. క్రమేణా ఇక్కడ పేయి దూడల ఉత్పత్తి తగ్గుతోంది. ఒకే రక్త సంబంధం కలిగిన కోడెలతో సంక్రమణం చెందడంతో జన్యుపరమైన ఇబ్బందులతో దూడలు ఆరోగ్యకరంగా జన్మించడం లేదు. దీనిపై దృష్టిపెట్టిన ప్రభుత్వం స్థానిక పరిశోధనా కేంద్రంలో పిండమార్పిడి కేంద్రాన్ని (ఎంబ్రయో ట్రాన్స్‌ఫర్‌ ల్యాబ్‌) నెలకొల్పింది. దీంతోపాటు ఎన్‌ఏహెచ్‌ఈపీ (నేషనల్‌ అగ్రికల్చర్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్ట్‌)కింద ఐకార్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌) ద్వారా రూ.3 కోట్ల నిధులతో ఐవీఎఫ్‌(ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా స్థానిక ల్యాబ్‌లో సెమన్‌ స్టోరేజీ చేసి, ఆ వీర్యాన్ని గుంటూరు జిల్లాలోని లాంఫారం, కర్ణాల్‌లోని యన్‌.బి.ఏ.జి.ఆర్‌ (జాతీయ జన్యువనరుల కేంద్రం)లో భద్రపరిచేవారు. ఇకపై పూర్తి స్థాయిలో అన్ని పనులు ఇక్కడే జరగనున్నాయి. 

పిండమార్పిడి పద్ధతి  
పుంగనూరు జాతి ఎద్దునుంచి సెమన్‌ను తీసి దాని ద్వారా ఎక్కువ అండాలను ఉత్పత్తి చేయిస్తారు. ఆపై కృత్రిమ గర్భ«ధారణ ద్వారా ఫలదీకరణం జరిపి ఈ అండాలను పోగుచేసి సరోగసీ పద్ధతిలో ఎదకొచ్చిన ఆవులకు ఇంప్లాంట్‌ చేస్తారు. దీంతో   ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. తద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టిరకం పశువుల ఉత్పత్తి జరగనుంది. 

అంతరించిపోతున్న అరుదైన జాతులు 
దేశంలో 34 రకాల పశు జాతులున్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులే. ఇవి స్థానిక పశు పరిశోధనా కేంద్రంలో 200 ఉండగా వీటి సంఖ్య ఇప్పుడు 276కు చేరుకుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఇవి వందకు పైగా ఉన్నట్టు సమాచారం. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో వేచూరు రకం పొట్టి ఆవుల (ఇవి ఎరుపు రంగులో ఉంటాయి) సంఖ్య పదికి పడిపోయింది. ఇక అ«ధిక పాలనిచ్చే షాహీవాల్‌ రకం కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇవి మన దేశంలోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పాకిస్తాన్‌లోనూ మాటంగొమేరి జిల్లాలో మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనా వీటన్నింటికంటే అత్యంత అరుదైన జాతి పుంగనూరు రకమే. అందుకే వీటిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

పుంగనూరు రకాన్ని మరింత అభివృద్ధి చేస్తాం  
ఇక్కడి పరిశోధనా కేంద్రంలో 276 వరకు పుంగనూరు రకం పశువులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎల్‌డీఏ ద్వారా ఈ జాతి వీర్యాన్ని అందించేందుకు ఇప్పటికే కృషి చేస్తున్నాం. మరో నెల రోజుల్లో ఇక్కడ ఐవీఎఫ్‌ ల్యాబ్‌ సిద్ధమవుతుంది. దీంతో వీర్యాన్ని వృథా కానీయకుండా ఎక్కువ పశువులకు ఇచ్చి పుంగనూరు వెరైటీని పెంచుతాం. రాబోవు రెండేళ్లలో పశువుల సంఖ్యను 500 చేసేలా లక్ష్యం పెట్టుకున్నాం.             
డాక్టర్‌ వేణు, సైంటిస్ట్, పశుపరిశోధన కేంద్రం, పలమనేరు 

మరిన్ని వార్తలు