‘దిశ’ స్ఫూర్తితో 74 కేసుల్లో శిక్షలు

4 Oct, 2020 04:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహిళలపై నేరాలకు, అకృత్యాలకు ఒడిగట్టే వారికి కఠిన శిక్షలు వేయడమే కాకుండా.. వేగంగా శిక్షలు పడేలా రాష్ట్ర ప్రభుత్వం ‘దిశ’ చట్టాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. దీనికి కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉన్నప్పటికీ.. నేరాలకు పాల్పడిన వారిపై దిశ చట్టం స్ఫూర్తితో న్యాయస్థానాల్లో  వేగంగా శిక్షలు ఖరారయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే దిశ చట్టం చేసిన తరువాత ఆగస్టు నెల వరకు మహిళలపై నేరాలకు పాల్పడిన 74 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. 

జాప్యాన్ని నివారించి..
► సాధారణంగా న్యాయస్థానాల్లో సంవత్సరాల తరబడి వాదనలు నడుస్తాయి. దీనివల్ల కేసులు వాయిదాలు పడుతూ వస్తాయి. 
► అయితే, దిశ చట్టం కింద నేరం జరిగిన ఏడు రోజుల్లో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయాలి. 21 రోజుల్లోనే నిందితులకు శిక్షలు ఖరారు కావాలి. 
► ఇందుకోసం కేసుల విచారణకు మహిళా ప్రత్యేక కోర్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దిశ చట్టం రూపుదిద్దుకున్నాక మహిళలపై నేరాలకు సంబంధించి ఇప్పటివరకు 74 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి.
► వాటిలో మూడు కేసుల్లో నిందితులకు మరణ శిక్షలు పడ్డాయి. 
► మరో ఐదు కేసుల్లో జీవిత ఖైదు, రెండు కేసుల్లో 20 ఏళ్ల పాటు జైలు శిక్షలు ఖరారయ్యాయి.

మహిళలకు రక్షణ కవచం ‘దిశ’
– దీపికా పాటిల్, ‘దిశ’ ప్రత్యేక అధికారి
మహిళల రక్షణ కవచంలా ఉండేలా సీఎం వైఎస్‌ జగన్‌ ‘దిశ’ బిల్లు తెచ్చారు. ఎక్కడైనా నేరం జరిగితే కేసు నమోదు, పోలీస్‌ దర్యాప్తు, న్యాయ విచారణ వేగంగా పూర్తి చేసేలా దృష్టి సారించాం. ప్రతి దిశ పోలీస్‌ స్టేషన్‌లో ప్రభుత్వం ఐదుగురు ఎస్సైలను నియమించింది. అందుకే కేసుల్లో వేగంగా తీర్పులు వచ్చి దోషులకు శిక్షలు పడుతున్నాయి. దిశ బిల్లు రాక ముందు ఉన్న కేసులను కూడా దీని పరిధిలోకి తెచ్చి వేగంగా విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు