పంజాబ్‌కు ఆదర్శంగా ఏపీ

29 Oct, 2022 04:27 IST|Sakshi
డాక్టర్‌ వైఎస్సార్‌ పశు సంచార వైద్య సేవా రథాలను పరిశీలిస్తున్న వికాస్‌ ప్రతాప్‌ తదితరులు

ఇక్కడి తరహాలోనే అక్కడా పశుసంచార వైద్యసేవా రథాల ఏర్పాటు

మూగజీవాల ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌

ఏపీ నుంచి నేర్చుకోవాల్సిన, ఆచరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి

‘సాక్షి’తో పంజాబ్‌ పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌ ప్రతాప్‌

విజయవాడలో వెటర్నరీ అంబులెన్స్‌ సేవల పరిశీలన

సాక్షి, అమరావతి: పాడి అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిన పంజాబ్‌ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుంటోంది. మూగజీవాల కోసం ఏపీ ప్రభుత్వం విజయవంతంగా అమలుచేస్తున్న మొబైల్‌ అంబులేటరీ వెహికల్స్‌ సేవలను పంజాబ్‌లోనూ ఆచరణలోకి తీసుకొస్తున్నామని.. ఇందుకోసం కార్యాచరణ సిద్ధంచేస్తున్నామని పంజాబ్‌ రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌ ప్రతాప్‌ తెలిపారు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ సంచాలకుల కార్యాలయంలో వైఎస్సార్‌ పశుసంచార వైద్య సేవా రథాలను పంజాబ్‌ స్టేట్‌ పశుసంవర్ధక శాఖ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎంపీ సింగ్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అంబులెన్స్‌లో ఏర్పాటుచేసిన సౌకర్యాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అందులో ఉన్న సౌకర్యాలను పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ రెడ్నం అమరేంద్రకుమార్‌ వివరించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో వికాస్‌ ప్రతాప్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

ఏపీ ఆర్బీకేలపై దేశవ్యాప్తంగా చర్చ
22 జిల్లాలతో కూడిన మా రాష్ట్రంలో 25 లక్షల ఆవులు, 40 లక్షల గేదెలున్నాయి. ముర్రా జాతి పశువులే ప్రధాన పాడి సంపద. ఏపీలో మాదిరిగానే పంజాబ్‌లోనూ సహకార రంగం చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడి ఆర్బీకేల తరహాలో సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఏపీలో ఏర్పాటుచేసిన ఆర్బీకేలపై దేశం మొత్తం చర్చించుకుంటోంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా దూరదృష్టితో వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ సెంటర్స్‌గా తీర్చిదిద్దిన ఆర్బీకేల ఆలోచన చాలా వినూత్నం. అలాగే, దేశీవాళీ గో జాతులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఇక్కడ గో పెంపకం కేంద్రాల ఏర్పాటు కూడా మంచి ఆలోచన. వాటి ఉత్పత్తులకు కూడా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం నిజంగా గొప్ప విషయం. ఏపీ ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సిన, ఆచరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

పంజాబ్‌లో 70 వాహనాలు ఏర్పాటుచేస్తున్నాం
వైఎస్సార్‌ పశు సంచార వైద్య సేవా రథాలలో కల్పించిన సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇదే మోడల్‌లో మా రాష్ట్రంలోనూ జిల్లాకు మూడుచొప్పున 70 వాహనాలు ఏర్పాటుచేయాలని సంకల్పించాం. అందుకోసమే వాటిని çపరిశీలించేందుకు ఇక్కడకు వచ్చాం. తాము ఊహించిన దానికంటే మెరుగైన సౌకర్యాలను ఈ అంబులెన్స్‌లలో కల్పించారు.

ప్రతీ వాహనానికి ఓ పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్లను నియమించడం, వెయ్యికిలోల బరువున్న జీవాలను తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్‌ లిఫ్ట్, 20 రకాల పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు అనువుగా మైక్రోస్కోప్‌తో కూడిన మినీ లేబొరేటరీ, ప్రాథమిక వైద్యసేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించడం చాలా బాగుంది. టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేయగానే రైతు ముంగిటకు వచ్చి వైద్యసేవలు అందిస్తున్న తీరు కూడా అద్భుతం. వాహనాలను డిజైన్‌ చేసిన టాటా, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జీవీకే యాజమాన్యాలకు నా ప్రత్యేక అభినందనలు. 

మరిన్ని వార్తలు