కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు

11 Oct, 2023 04:56 IST|Sakshi

‘దసరా’ వేళ ప్రయాణికులకు 10 శాతం రాయితీ 

ఆర్టీసీ ఎండీ తిరుమలరావు  

నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): ఈ ఏడాది కొత్తగా వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు కొనుగోలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం ఆయన నర్సీపట్నం ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విజయదశమి ఆర్టీసీకి ఆదాయం తెచ్చే పండుగ అన్నారు. దసరాకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 5,500 స్పెషల్‌ బస్సులను తిప్పుతున్నామన్నారు. గతంలో దసరా పర్వదినాల్లో 50 శాతం అదనపు చార్జీలు  విధించటం జరిగేదని, రెండేళ్లుగా చార్జీల పెంపునకు స్వస్తి పలికామని చెప్పారు.

రాను పోను ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. రాయితీలు కల్పించి ఓఆర్‌ పెంచి ఆదాయ పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా 1500 డీజిల్‌ బస్సులు ఆర్డర్‌ చేశామన్నారు. డీజిల్‌ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ఏడాది వెయ్యి ఎలక్ట్రిక్‌  బస్సులు కొనుగోలు చేశామని, మూడు నెలల్లో ఎలక్ట్రికల్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇకపై ప్రతి ఏటా వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు కొనేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

అలాగే పీఎఫ్‌ బకాయిలు సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించటం వల్ల  సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం హయ్యర్‌ పెన్షన్‌ ఆప్షన్‌ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పెన్షన్‌ వచ్చే కేడర్‌లో ఉన్న వారికి ఇకపై రూ.25 వేలు పెన్షన్, రూ.5 నుంచి 6 వేలు ఉన్న వారికి రూ.30 వేలు నుంచి రూ.50 వేలు వరకు పెన్షన్‌ వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన డిపో ఆవరణలో మొక్కలు నాటారు. స్థానిక ఏఎస్పీ అదిరాజ్‌ సింగ్‌ రాణా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అంద­జేశారు. ఎండీ వెంట జిల్లా ప్రజారవాణా సంస్థ అధికారి పద్మావతి ఉన్నారు.

మరిన్ని వార్తలు