31.71 లక్షల వ్యాక్సిన్‌ డోసుల కొనుగోలు 

23 May, 2021 03:51 IST|Sakshi

ఇంతకంటే ఎక్కువ కొనుగోలు చేద్దామన్నా కేటాయించని కేంద్రం 

మేలో 16.85 లక్షలు, జూన్‌కి 14.86 లక్షల డోసులు కొనుగోలు చేసిన రాష్ట్రం 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాక్సిన్‌ను అందరికీ ఉచితంగా వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోయినప్పటికీ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం కేవలం 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే కోవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు గల వారి నుంచి అందరికీ ఉచితంగా కోవిడ్‌ టీకా వేస్తామని, ఇందుకోసం రూ.1,600 కోట్లు వ్యయం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

ఇందులో భాగంగా రాష్ట్రానికి అవసరమైన కోవిడ్‌ టీకాలను వెంటనే కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం కేటాయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం మే, జూన్‌లకు కలిపి 31.71 లక్షల వ్యాక్సిన్‌ డోసులను కేటాయించగా ఆ మొత్తం డోసులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మే నెలకు కేంద్రం కేటాయించిన 16.85 లక్షల డోసులను కొనుగోలు చేసినప్పటికీ ఇంకా 5.21 లక్షల డోసులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. జూన్‌కు కేటాయించిన 14.86 లక్షల డోసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ డోసులు కూడా ఇంకా కేంద్రం నుంచి రావాల్సి ఉంది.  

4.44 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసుల రాక
గన్నవరం: రాష్ట్రానికి 4.44 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం చేరుకున్నాయి. పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో రాత్రి 8.15 గంటలకు చేరుకున్నాయి. అనంతరం వ్యాక్సిన్‌ డోసులను కంటైనర్‌లో రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తరలించి భద్రపరిచారు. 

మరిన్ని వార్తలు