ఎలక్ట్రిక్‌ వాహనాలు రయ్‌..రయ్‌

13 Aug, 2022 03:40 IST|Sakshi

వీటిలో ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లే అధికం

ఈవీ కార్ల వినియోగమూ పెరుగుతోంది

ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 35,677కు ఈవీలు

ప్రభుత్వ తోడ్పాటుతో వేగం పుంజుకున్న కొనుగోళ్లు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు పెరుగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లు, కార్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. గత ఏడాది (2021) మార్చి నాటికి రాష్ట్రంలో మొత్తం 20,294 ఎలక్ట్రిక్‌ వాహనాలుండగా ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 35,677కు పెరిగింది. అంటే ఏడాదిలోనే 15,383 ఎలక్ట్రిక్‌ వాహనాలు పెరిగాయి. గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు మధ్యనే 12 వేల ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 9,762 ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లుండగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 21,765కు పెరిగింది. అంటే ఏడాదిలోనే 12,003 ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లు అమ్ముడయ్యాయి. 

కార్లూ పెరుగుతున్నాయ్‌
మరోవైపు రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ కార్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 7,957 ఎలక్ట్రిక్‌ కార్లుండగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 8,427కు చేరింది. అలాగే ఏడాది కాలంలో రాష్ట్రంలో ఈ–రిక్షాల సంఖ్య రెట్టింపైంది. గత ఏడాది మార్చి నాటికి ఈ–రిక్షాల సంఖ్య 672 కాగా.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 1,322కు పెరిగింది. ఎలక్ట్రిక్‌ మూడు చక్రాల గూడ్స్‌ వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత ఏడాది మార్చి నాటికి ఎలక్ట్రిక్‌ మూడు చక్రాల గూడ్స్‌ వాహనాలు కేవలం 16 మాత్రమే ఉంటే.. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 170కు పెరిగాయి. 

చార్జింగ్‌ స్టేషన్లు వస్తే మరింత పెరుగుదల
పెట్రోల్, డీజిల్‌ బంకుల తరహాలో బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుంది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను లేకపోవడంతో ఇటీవల వాటి వినియోగం పెరుగుతోంది. ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. 2030 నాటికి పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగంలోకి తేవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. భవిష్యత్‌లో ఈ వాహనాల వినియోగం మరింత పెరుగుతుంది.
– ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ 

మరిన్ని వార్తలు