నూతన్‌ నాయుడు చేసింది తీవ్రమైన నేరం: పీవీ రమేష్‌

5 Sep, 2020 16:06 IST|Sakshi

సాక్షి, అమరావతి : శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ కుమార్‌ నాయుడుపై ఏపీ సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పేరు చెప్పి అధికారుల నుంచి సహాయం పొందేందుకు నూతన్‌ నాయుడు యత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరు చెప్పి పలువురి అధికారులకు ఫోన్‌ చేశాడని.. డబ్బులు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని పీవీ పేర్కొన్నారు. తన పేరు ప్రతిష్టలను కూడా నాశనం చేశాడని మండిపడ్డారు. తన పేరుతో అధికారులకు ఫోన్‌ చేయడాన్ని ఆయన ఖండించారు. నూతన్‌ నాయుడు చేసింది తీవ్రమైన నేరమని ఆయన అన్నారు.

‘ఆగస్ట్‌ 29న నా పేరును ఉపయోగించి, నా మాటను అనుకరిస్తూ ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌కు కాల్‌ చేశారు. ఒక పేషేంట్ వస్తున్నారు, 15 రోజులు పాటు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ ప్రిన్సిపాల్‌తో చెప్పారు. నా గొంతును అనుకరిస్తూ మాట్లాడటంతో అనుమానం వచ్చి ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ నాకు కాల్‌ చేశారు. ఎవరో నా మాట అనుకరిస్తున్నారు అనే విషయాన్ని డీజీపీ, అడిషనల్‌ డీజీపీ, విశాఖ సీపీకి  ఫిర్యాదు చేశాను. ఆ ఫోన్‌ నెంబర్ హైదరాబాద్‌ అడ్రస్‌ ఉందని విచారణలో తేలింది. ఆ నంబర్‌కు కాల్‌ చేస్తే‘అడిషనల్‌ సీఎస్‌ సీఎం’ అని వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నా మాట అనుకరిస్తూ ఫోన్‌ చేస్తున్న వారి మాటలు నమ్మకండి’అని రమేష్‌ పేర్కొన్నారు. 

(చదవండి : శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు అరెస్ట్‌)

కాగా, నూతన్‌ నాయుడు గురువారం అరెస్టయిన విషయం తెలిసిందే.  శిరోముండనం కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు. కాగా, దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు