మరింతమంది సింధూలు తయారు కావాలి 

7 Aug, 2021 04:47 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆకాంక్ష 

సచివాలయంలో సింధును ఘనంగా సత్కరించిన సీఎం 

విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని సూచన  

ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల నగదు బహుమతి 

సీఎం ఆశీర్వాదంతోనే పతకాన్ని సాధించా 

ప్రభుత్వం క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం అందిస్తోంది 

టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధు

సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/ద్వారకా తిరుమల/పెదవేగి: రాష్ట్రం నుంచి మరింతమంది సింధూలు తయారుకావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. విశాఖపట్నంలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని ఆమెకు సూచించారు. టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకున్న పీవీ సింధు తన తల్లిదండ్రులతో శుక్రవారం సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. తాను సాధించిన పతకాన్ని ఆయనకు చూపించారు. మీ ఆశీర్వాదంతోనే పతకాన్ని సాధించానని చెప్పారు. ఈ సందర్భంగా సింధును సీఎం ఘనంగా సత్కరించారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని ప్రశంసించారు. సీఎంను కలిసిన అనంతరం ప్రభుత్వం తరఫున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమతిని  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజిత్‌ భార్గవ అందజేశారు.  

సీఎం జగన్‌ ప్రోత్సాహంతోనే..  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలవడం ఆనందంగా ఉందని పీవీ సింధు అన్నారు. సీఎంను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సీఎంను మర్యాదపూర్వకంగా కలవగా ఆయన ఆశీర్వదించారని తెలిపారు. పతకం తీసుకురావాలని తనను ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఆయన కోరినట్టే పతకం సాధించినందుకు తనను అభినందించారన్నారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తుండటం తమకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తోందన్నారు. క్రీడాకారులకు వైఎస్సార్‌ పురస్కారాలను అందజేయడం కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. విశాఖలో క్రీడా అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందని.. త్వరలోనే అకాడమీని ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.  

దుర్గమ్మ సేవలో సింధు 
పీవీ సింధు కుటుంబసమేతంగా శుక్రవారం విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సింధుకు ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్నాక వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం సింధుకు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు ముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని గుర్తు చేశారు. పతకం సాధిస్తే మళ్లీ వస్తానని మొక్కుకున్నానని.. అందుకే ఇప్పుడు దుర్గమ్మ దర్శనానికి వచ్చానని తెలిపారు.

ఏ టోర్నమెంట్‌కు వెళ్లినా ముందు అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకుంటానన్నారు. ఈ అక్టోబర్‌ నుంచి టోర్నమెంట్లు ఉన్నాయని.. వాటిలో విజయం సాధించేందుకు కష్టపడతానని చెప్పారు. 2024 ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడమే తన ముందు ఉన్న లక్ష్యమని స్పష్టం చేశారు. కాగా, పీవీ సింధు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని, పెదవేగి మండలం రాట్నాలకుంటలో శ్రీ రాట్నాలమ్మ తల్లిని కూడా కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాల ఈవోలు, అర్చకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ద్వారకా తిరుమలలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాట్నాలకుంటలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి.. సింధును ఘనంగా సత్కరించారు. 

మరిన్ని వార్తలు