పైలా చంద్రమ్మకు ఘన నివాళి

24 Sep, 2020 15:29 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : శ్రీకాకుళం సాయుధ పోరాట ఉద్యమ నాయకురాలు చంద్రమ్మ అంత్యక్రియలు ముగిశాయి. విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రి నుంచి జ్ఞానాపురం స్మశాన వాటిక వరకు ప్రజాసంఘాల ప్రతినిధులు  ర్యాలీగా వెళ్లారు. శ్రీకాకుళం భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాట ఉద్యమ నాయకురాలు పైలా చంద్రమ్మకు ప్రజా సంఘాల నేతలు ఘనంగా నివాళులర్పించారు. చంద్రమ్మ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం రిట్ట పాడు గ్రామ వాసి. ప్రముఖ నక్సలైట్ పైలా వాసుదేవరావు ను అజ్ఞాతంలో వివాహమాడిన చంద్రమ్మ గరుడ భద్ర భూస్వా మ్య వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మందస ఎన్ కౌంటర్ లో పోలీసుల కాల్పుల్లో గాయపడిన చంద్రమ్మ కొంతకాలం జైలు జీవనం సాగించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా రాత్రి ప్రాణాలు విడిచారు. ఈ దశలో ఆమె పార్థివదేహాన్ని ఆమె కుమార్తె అరుణతో సహా ప్రజాసంఘాల ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో రైతుల పక్షాన నిలిచి పోరాడిన చంద్రమ్మ ఉద్యమస్ఫూర్తిని కొనియాడారు.

ఉద్దాన ప్రాంతంలో విషాద ఛాయలు
శ్రీకాకుళం గిరిజన సాయుధ పోరాటంలో తుపాకి పట్టి పోరాడిన రైతాంగ పోరాటయోధురాలు పైలా చంద్రమ్మ (70) బుధవారం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బుధవారం తెల్లవారుజామున కేజీహెచ్‌లో చేర్చారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆమె బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తెలిపారు. ప్రస్తుతం ఆమె న్యూడెమొక్రసీ పార్టీకి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. విశాఖలోనే అంత్యక్రియలు జరుగుతాయని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. 1968లో సీపీఐ అనుబంధంగా ఉన్న మహిళా సంఘంలో పనిచేశారు. ఉద్దాన ప్రాంతంలోని గరుడబద్ర భూస్వామి మద్ది కామేశ్‌ ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత న్యూడెమొక్రసీ సాయుధ దళంలోనూ పనిచేశారు.  ప్రముఖ నక్సలైట్‌ నాయకుడు పైలా వాసుదేవరావును చంద్రమ్మ దళంలోనే వివాహం చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు