గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టులకు సీపీటీలో అర్హత తప్పనిసరి 

26 Feb, 2023 05:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్‌–2, గ్రూప్‌–3 తదితర క్యాడర్‌ పోస్టుల నియామక ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఈ పోస్టులకు నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో విజయం సాధించినవారు తప్పనిసరిగా కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (సీపీటీ)లో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ శనివారం ఉత్తర్వులు (జీవో నంబర్‌–26) జారీచేశారు. దీనికి సంబంధించిన అడహక్‌ నిబంధనలను జీవో నంబర్‌ 26లో పొందుపరిచారు. సీపీటీ టెస్ట్‌కు సంబంధించిన సిలబస్, రిజర్వేషన్‌ల వారీగా అర్హత మార్కులను కూడా ఉత్తర్వుల్లో వివరించారు.

కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో అర్హత సర్టిఫికెట్‌ లేకుండా నేరుగా ఏ ఒక్కరికీ ఆయా పోస్టుల్లో నియామకాలకు అవకాశం లేదని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లేదా ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్యా, శిక్షణ బోర్డు, లేదా రాష్ట్ర యూనివర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు, యూజీసీ గుర్తింపు ఉన్న ఇతర సంస్థలు నిర్వహించే ఈ కంప్యూటర్‌ ప్రొఫెషియన్సీ పరీక్షలో అర్హత సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఈ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష 100 మార్కులకు ఉంటుందని, పరీక్ష సమయం 60 నిమిషాలని వివరించారు. ఈ పరీక్షలో అర్హత కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాలని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, పరీక్ష ప్యాట్రన్‌ను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 

మరిన్ని వార్తలు