నగదు బదిలీతో.. హక్కుగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు 

23 Aug, 2021 02:48 IST|Sakshi

స్వచ్ఛందంగా అంగీకారం తెలిపిన 92 శాతం మంది రైతులు 

అన్నదాతల భాగస్వామ్యంతో పథకం అమలుకు శ్రీకారం 

మీటర్ల ఏర్పాటుతో లోడ్, వినియోగంపై కచ్చితమైన లెక్కలు 

ఆ మేరకు సామర్థ్యం పెంచి తగినంత కరెంట్‌ సరఫరా 

ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం లాంటి సమస్యలకు తెర 

పంపిణీ సంస్థల్లో పెరగనున్న జవాబుదారీతనం 

పథకం పురోగతిపై సమీక్షించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి  

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీ పథకానికి రైతుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. వైఎస్సార్‌ ఉచిత విద్యుత్తు పథకానికి నగదు బదిలీ అమలు పురోగతిపై ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ ఆదివారం విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వివరాలు తెలియచేశారు. నగదు బదిలీ పథకం కింద రైతులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా విద్యుత్తు బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి వారి ఖాతాలకు జమ చేయనుంది. ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని రైతులే నేరుగా విద్యుత్తు సంస్థలకు బిల్లుల రూపంలో ల్లించనున్నారు. రైతులే బిల్లులు చెల్లించి విద్యుత్తు తీసుకుంటారు కాబట్టి నాణ్యమైన కరెంట్‌ సరఫరాను తమ హక్కుగా ప్రశ్నించే వీలుంది. మరోవైపు తమకు బిల్లులు చెల్లిస్తున్న అన్నదాతల పట్ల విద్యుత్తు పంపిణీ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో వ్యవహరిస్తాయి. వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు మీటర్లను బిగించడం వల్ల లోడ్‌ ఎంతనేది ముందే స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. తగినంత విద్యుత్తు సరఫరా జరుగుతుంది కాబట్టి మోటార్లు కాలిపోవు. లో వోల్జేజీ సమస్య అనేది ఎక్కడా ఉండదు. తద్వారా రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందుతుంది. 

పైసా కూడా భారం పడకుండా..
రైతన్నల అనుమతితోనే నగదు బదిలీ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలన్న లక్ష్యం నెరవేరుతోంది. పథకం అమలుకు అంగీకరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 92 శాతం మంది రైతులు విద్యుత్‌ సంస్థలతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వ్యవసాయ విద్యుత్‌ ధరను యూనిట్‌ సరాసరి రూ.5.73గా ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయించినప్పటికీ రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఆ వ్యయాన్నంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రైతుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తుంది. పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్న ఈ పథకానికి 98.6 శాతం మంది రైతులు అంగీకారం తెలిపారు. 

సామర్థ్యం పెంపు... లో ఓల్టేజీ పరిష్కారం 
మీటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్‌ లోడు ఎక్కడ ఎక్కువ ఉంది? ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ లైన్ల సామర్ధ్యం ఎక్కడ, ఎంత పెంచాలి? అనే అంశాలను డిస్కమ్‌లు కచ్చితంగా తెలుసుకునే వీలుంది. లో ఓల్టేజి సమస్యలను గుర్తించి పరిష్కరించవచ్చు. ఇబ్బందులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ పగటి పూటే 9 గంటల పాటు సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వ్యవసాయ లోడ్‌ను కచ్చితంగా లెక్కించవచ్చు. ఇప్పటివరకూ ఈ విధానం లేదు.

మరో 30 ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా..
నాణ్యమైన కరెంట్‌ కోసం విద్యుత్‌ సంస్థలను ప్రశ్నించే హక్కు రైతులకు కల్పిస్తున్న ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శికి మంత్రి బాలినేని సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, ఉత్పాదకతను పెంచడం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు పథకం అమలులో రాష్ట్ర్‌రంలోని ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్‌కు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులంతా నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరాటంకంగా పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 

మరిన్ని వార్తలు