పేదింటికి పావలా వడ్డీ రుణాలు 

31 Dec, 2021 04:07 IST|Sakshi

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం తొలి దశ లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు

తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం

ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు

లబ్ధిదారులకు పావలా వడ్డీకే రూ. 35 వేల చొప్పున రుణం

ప్రభుత్వ ఆదేశాలతో త్వరితగతిన రుణాలిస్తున్న బ్యాంకులు

ఇప్పటికే 2.12 లక్షల మందికి రూ.735.61 కోట్లు మంజూరు

సాక్షి, అమరావతి: తొలి దశలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులందరికీ వారి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు పావలా వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఇళ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి అయ్యేందుకు ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేలు పావలా వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు గృహ నిర్మాణ శాఖ పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కూడా ఈ రుణాలివ్వాలని అన్ని బ్యాంకులను ఆదేశించింది. దీంతో బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇప్పటికే 2.12 లక్షల మందికి రూ.735.61 కోట్ల మేర పావలా వడ్డీ రుణాలు ఇచ్చాయి. 

ఈ పథకం కింద తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల వెసులుబాటు కోసం పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది. ఇప్పటికే అత్యధికంగా చిత్తూరు, ప్రకాశం, అనంతరపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. రుణాల మంజూరులో వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి రుణాలిప్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ తెలిపారు. తరచూ జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి, త్వరితగతిన రుణాలిప్పించాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. 

వర్షాలు తగ్గడంతో నిర్మాణాలు వేగవంతం 
వర్షాలు తగ్గడంతో పేదల ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుందని అజయ్‌ జైన్‌ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్‌ బిల్లులు రూ. 934.26 కోట్లను, సామాగ్రి సరఫరా బిల్లు రూ. 42.22 కోట్లను చెల్లించేసినట్లు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో మరింత వేగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

మరిన్ని వార్తలు